Published : 08/04/2022 18:09 IST

మా ఆయన అమ్మాయిలతో చాట్ చేస్తుంటాడు.. నన్ను పట్టించుకోడు..!

హలో మేడమ్‌.. నా వయసు 27 సంవత్సరాలు.. పెళ్లై ఏడాది దాటింది. మాది ప్రేమ వివాహం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా అత్తమామలు నన్ను అస్సలు పట్టించుకోరు. మా ఆయనేమో వేరే ఆడవాళ్లతో చాట్‌ చాస్తుంటాడు. అదేంటని అడిగితే చేయి చేసుకున్నాడు. సరేనని సర్దుకుపోయినా తన ధోరణి మార్చుకోవట్లేదు. వాళ్ల ఇంట్లో వాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నాడు. నేనన్నా, నా మాటన్నా అస్సలు విలువ చేయడు. దాంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. వచ్చి మూడు నెలలవుతున్నా ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు. నేనే తనకు ఫోన్‌ చేస్తే ‘నీ ఇష్టం.. వస్తే రా.. లేకపోతే లేదు’ అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

మీ పరిస్థితులను మీరే స్వీయ విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నించండి. అతను నిజంగా తల్లిదండ్రుల మాటకే గౌరవం ఇచ్చే వ్యక్తి అయితే.. తల్లిదండ్రులను ఎదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉండేవారు కాదు. అలాగే ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భార్య మాటకే విలువిస్తాడు.. మమ్మల్ని పట్టించుకోడు’ అనే భావన మీ అత్తమామలకూ ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి అతని దృష్టిలో వాళ్లకు విలువ తగ్గలేదు అని చూపించే ప్రయత్నం అతిగా చేస్తున్నాడా? అనే విషయం గురించి ఆలోచించండి.

మీ అత్తమామలకు మీపట్ల వ్యతిరేకత పెళ్లికి ముందు నుంచే ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి మిమ్మల్ని వారికి అనువుగా ఉండే కోడలిగా చూపించుకోవడానికి అతిగా వ్యవహరించాడేమో? దానితో విసిగిపోయిన మీరు పుట్టింటికి వెళ్లిపోవడంతో ‘చూశావా మేము చెప్పిందే జరిగింది’ అనే అవకాశం వాళ్లకు దొరికిందేమో? అన్న విషయాలను పరిశీలించుకోండి. ఎవరు ఏం చెప్పినా అది ఊహాగానమే అవుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టండి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ మనసుల్లో ఏముంది? మీ ఆలోచనలు ఏంటి? అనేవి స్పష్టం చేసుకోండి. దీనివల్ల సమస్య ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న కారణాలను పెద్దవి చేసుకోవడం వల్ల మీ ప్రేమను మీరే పలుచన చేసుకున్న వారవుతారేమో అన్న విషయాన్ని కూడా ఆలోచించండి.

మీ భర్త ఇతర స్త్రీలతో చాటింగ్‌ చేస్తున్నాడని అంటున్నారు. అయితే అతను పరిధులకు లోబడే చేస్తున్నాడా? లేదంటే పరిధి దాటుతున్నాడా? అనేది ముందుగా నిర్ధారించుకోండి. ఒకవేళ అతను తన పరిధి దాటినట్లయితే ఆలస్యం చేయకుండా మానసిక నిపుణులను సంప్రదించడం అవసరం. అలాకాకుండా అబ్బాయిలతో ఎలా మాట్లాడుతున్నాడో అమ్మాయిలతో కూడా అలానే మాట్లాడుతున్నట్లయితే.. ఆ విషయాన్ని మీరు భూతద్దంలో చూస్తున్నారా? అన్నది పరిశీలించుకోండి. ఏదేమైనా ఇద్దరూ కలిసి సానుకూల ధోరణితో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని