గర్ల్‌ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!

స్నేహితులతో వెకేషన్‌ అనగానే ఎగిరి గంతేస్తాం.. ఎలాంటి ప్రదేశానికి వెళ్తే బాగుంటుందని గూగుల్‌లో గాలిస్తాం.. అందరికీ నచ్చిన, అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాం.. ఇలా గర్ల్‌ గ్యాంగ్‌ మెచ్చిన ప్రదేశాల్లో ఇండోనేషియాలోని ‘బాలి’ దీవులు ముందు వరుసలో ఉంటాయంటున్నారు నిపుణులు.

Published : 25 Apr 2024 16:19 IST

స్నేహితులతో వెకేషన్‌ అనగానే ఎగిరి గంతేస్తాం.. ఎలాంటి ప్రదేశానికి వెళ్తే బాగుంటుందని గూగుల్‌లో గాలిస్తాం.. అందరికీ నచ్చిన, అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాం.. ఇలా గర్ల్‌ గ్యాంగ్‌ మెచ్చిన ప్రదేశాల్లో ఇండోనేషియాలోని ‘బాలి’ దీవులు ముందు వరుసలో ఉంటాయంటున్నారు నిపుణులు. దీన్ని సెలబ్రిటీల హాట్‌స్పాట్‌గానూ అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే బర్త్‌డే అయినా, బ్యాచులరెట్‌ పార్టీ అయినా.. ఇలా తమ గర్ల్‌ గ్యాంగ్‌తో చేసే ఎలాంటి హంగామాకైనా మన సెలబ్రిటీలు ఈ ప్రదేశాన్నే ఎక్కువగా ఎంచుకుంటారట! మరి, సాధారణ అమ్మాయిలైనా, సెలబ్రిటీలైనా.. అంతగా ఇష్టపడేంతలా ఇక్కడ ఏయే ప్రత్యేకతలున్నాయి? ఈ ప్రదేశం గర్ల్‌ గ్యాంగ్‌కి ఫేవరెట్‌ వెకేషన్‌ స్పాట్‌గా ఎలా మారింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

సాహసాలకు నెలవు!

వెకేషన్‌ అనగానే సాహసాలే గుర్తొస్తుంటాయి. అందులోనూ ఈ కాలపు అమ్మాయిలు సాహసాలు చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు కూడా! మరి, ఇవే సాహసాల్ని పచ్చపచ్చటి ప్రకృతి నడుమ, అల్లంత ఎత్తు నుంచి జాలువారే జలపాతాల మధ్య చేస్తే.. ఆ అనుభూతే వేరు కదూ! స్నేహితులతో ఇలాంటి అనుభూతుల్ని సొంతం చేసుకోవాలంటే బాలి వెళ్లాల్సిందే! అక్కడి చీకటి గుహల్లో బైక్‌ రైడింగ్‌, ఆకాశంలో ఉయ్యాలలూగే అనుభూతిని పంచే జంగిల్‌ స్వింగ్‌, పచ్చటి ప్రకృతి-జాలువారే జలపాతాల మధ్యలో నుంచి చేసే ట్రెక్కింగ్‌, సముద్రపు అందాల్ని తనివితీరా ఆస్వాదిస్తూ ఈత కొట్టడం.. ఇవన్నీ స్నేహితురాళ్లతో కలిసి చేయడం భలే సరదాను పంచుతుంది.. ఎన్నో మధురానుభూతులూ మీ సొంతమవుతాయి. అయితే ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం, సంబంధిత గైడ్స్‌ సలహాలు పాటిస్తూ వారి పర్యవేక్షణలో చేయడం వల్ల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడచ్చు.

సెలబ్రిటీల హాట్‌ స్పాట్!

స్నేహితురాళ్లంతా ఒక్కచోట కలిశారంటే పార్టీ వాతావరణం నెలకొంటుంది. ఇక అందరూ కలిసి చెప్పుకునే కబుర్లు, చేసే షాపింగ్‌ సందడి, డీజే సంగీతానికి అనుగుణంగా వేసే స్టెప్పులు.. ఇలా వాళ్లు చేసే ఎంజాయ్‌మెంట్‌ అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. ఇలా గర్ల్ గ్యాంగ్‌తో చేసే సందడికి బీచ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిస్తే.. ఆ ఎంజాయ్‌మెంట్‌ రెట్టింపవుతుంది. ఇలాంటి మధురానుభూతుల్ని సొంతం చేసుకోవాలంటే బాలిలోని బీచ్‌ క్లబ్స్‌కి వెళ్లాల్సిందే! ఇక్కడ ఇతరులతో సంబంధం లేకుండా మీరు, మీ స్నేహితురాళ్లు మాత్రమే ప్రత్యేకంగా ఎంజాయ్ చేసేలా వ్యక్తిగతమైన పార్టీ రూమ్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ బ్యాచులరెట్‌ పార్టీలు, పుట్టిన రోజు వేడుకలూ గర్ల్‌ గ్యాంగ్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇక్కడి బీచ్‌ క్లబ్స్‌లో షాపింగ్‌ సదుపాయాలు కూడా ఉంటాయి. స్థానిక, అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించిన దుస్తులు, ఇతర వస్తువులూ కొనుగోలు చేయచ్చు. ఇన్ని సరదాలు, మధురానుభూతుల్ని మూటగట్టుకోవడానికే చాలామంది సెలబ్రిటీలు తమ బ్యాచులరెట్‌ పార్టీలు, పుట్టినరోజు వేడుకల కోసం బాలిలోని బీచ్‌ క్లబ్స్‌ను ఎంచుకుంటారట! అందుకే బాలిని సెలబ్రిటీల హాట్‌స్పాట్‌గానూ పిలుస్తుంటారు.

స్వర్గంలో తేలినట్లుగా!

అందంతో పాటు రిలాక్సేషన్‌నీ అందించే సాధనం స్పా. శరీరాన్ని, మనసును ఉత్తేజపరిచే ఈ చికిత్సను అమ్మాయిలు మరింతగా ఇష్టపడతారు. ఒంటరిగా కంటే స్నేహితురాళ్లతో కలిసి స్పాకి వెళ్తే ఆ మజాయే వేరు! మరి, బాలి స్పా సెంటర్లలో అలాంటి అనుభూతులెన్నో సొంతం చేసుకోవచ్చట! సహజసిద్ధమైన నూనెలు, స్క్రబ్స్‌తో చేసే స్పా మసాజ్‌లతో శరీరం, మనసు పునరుత్తేజితమవడమే కాదు.. చర్మ సౌందర్యమూ ఇనుమడిస్తుందంటున్నారు అక్కడి నిపుణులు. ఇదొక్కటే కాదు.. ఇక్కడి ఫ్లోరల్‌ బాత్‌, ప్రశాంతమైన వాతావరణంలో నిపుణులు చేసే సంపూర్ణ స్పా చికిత్సలు స్వర్గంలో తేలిన అనుభూతుల్ని అందిస్తాయట! అందుకే కరీనా కపూర్‌, ప్రియాంక చోప్రా వంటి ముద్దుగుమ్మలు బాలి టూర్‌కి వచ్చినప్పుడల్లా ఇక్కడి స్పా ట్రీట్‌మెంట్స్‌ని మాత్రం మిస్సవ్వరట! ఇలా ఫ్రెండ్స్‌తో కలిసి స్పా చికిత్సలు తీసుకోవడం, స్పా చికిత్స కోసం వాడే సహజసిద్ధమైన ఉత్పత్తుల్ని వెంట తీసుకెళ్లడం.. ఇవన్నీ ప్రత్యేకమైన అనుభూతుల్ని పంచుతాయనడంలో సందేహం లేదు.

షాపింగ్‌, ఈటింగ్‌.. అన్నీ ఒకే చోట!

‘ఎంజాయ్‌-ప్లే-ఈట్‌-షాప్‌’.. బాలిలోని షాపింగ్‌ సెంటర్ల నినాదం ఇది. దీనికి తగ్గట్లే వినోదం, ఆటలు, ఆహారం, షాపింగ్‌.. ఇలా అన్నీ ఒకే చోట ఈ సెంటర్లలోనే అందుబాటులో ఉంటాయట! ‘మాల్‌ బాలీ గలేరియా’, ‘ఉబుద్‌ ఆర్ట్‌ మార్కెట్‌’, ‘కుటా బీచ్‌వాక్‌’.. వంటివి ఇక్కడి షాపింగ్‌కి ప్రసిద్ధి. స్థానిక మహిళలు తయారుచేసే హ్యాండ్‌క్రాఫ్ట్స్‌, ఇతర వస్తువుల్ని.. ఈ మార్కెట్లలో విక్రయిస్తుంటారట! అంతేకాదు.. ఇక్కడికి వెళ్తే బాలిలోని పాపులర్‌ వంటకాల రుచినీ ఆస్వాదించచ్చు. అసలే అమ్మాయిలకు స్నేహితులతో కలిసి షాపింగ్‌, ఈటింగ్‌ అంటే భలే సరదా. కాబట్టి స్నేహితులతో కలిసి ఈ సరదాల్ని మిస్సవ్వద్దంటే బాలి వెళ్లాల్సిందే! అయితే తిరిగొచ్చేటప్పుడు మాత్రం ఇక్కడి ప్రత్యేకమైన ‘Luwak Coffee’ గింజల్ని వెంట తెచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

రాక్‌ బార్స్‌.. ప్రత్యేకత అదే!

బాలి దీవులంటేనే బీచ్‌లకు పెట్టింది పేరు. ఇక వీటిని ఆనుకొని ఉన్న రాక్‌ బార్స్‌/హోటల్స్‌ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా సముద్రానికి ఆనుకొని ఉన్న అతి ఎత్తైన పెద్ద రాయిపై ఏర్పాటుచేసే డైనింగ్‌, అటు అక్కడి రుచుల్ని ఆస్వాదిస్తూ, ఇటు సూర్యాస్తమయం చూడడం.. ఇక్కడి మరో ప్రత్యేకతగా చెబుతుంటారు బాలి సందర్శకులు. ఇక బీచ్‌లు, సూర్యోదయం, సూర్యాస్తమయం.. వంటివి ఎక్కువగా ఎంజాయ్‌ చేసే అమ్మాయిలకు ఇలాంటి రాక్‌ బార్స్‌/హోటల్స్‌ ఎన్నో మధురానుభూతుల్ని పంచుతాయి. అప్పుడప్పుడూ మన సెలబ్రిటీలు కూడా ఇక్కడి రాక్‌ బార్స్‌పై సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ, ఈ క్షణాల్ని ఫొటోల్లో బంధిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం మనం చూశాం.

కాబట్టి ఎలా చూసినా.. గర్ల్‌ గ్యాంగ్‌తో వెకేషన్‌ కోసం బాలి పర్‌ఫెక్ట్‌ స్పాట్‌ అనడంలో సందేహమే లేదు. మరి, ఆలస్యమెందుకు? బాలి వెకేషన్‌ కోసం మీరూ మీ ఫ్రెండ్స్‌తో కలిసి సిద్ధమైపోండి.. వచ్చేటప్పుడు బోలెడన్ని మధురానుభూతుల్ని మూటగట్టుకు రండి..!

మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్