అక్కడ మహిళా ఓటర్లదే హవా!

ఓటు హక్కును వినియోగించుకోవడమంటే భవిష్యత్తును ఎంచుకోవడమే! ఈ క్రమంలో ఈసారి కొన్ని రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరి, ఇంతకీ ఏంటా రాష్ట్రాలు? గతంతో పోల్చితే ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య పెరగడానికి కారణాలేంటి? తెలుసుకుందాం రండి..

Published : 30 Apr 2024 12:56 IST

ఓటు హక్కును వినియోగించుకోవడమంటే భవిష్యత్తును ఎంచుకోవడమే! ఈ క్రమంలో ఈసారి కొన్ని రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరి, ఇంతకీ ఏంటా రాష్ట్రాలు? గతంతో పోల్చితే ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య పెరగడానికి కారణాలేంటి? తెలుసుకుందాం రండి..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ  ఎన్నికల్లో భాగంగా దేశం మొత్తమ్మీద ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్‌ ముగిసింది. అయితే సాధారణంగా పోలింగ్‌ స్టేషన్లలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా కనిపించడం చూస్తుంటాం. కానీ ఈసారి ఇందుకు భిన్నమైన సమీకరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఎందుకంటే.. కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమట!

అక్కడే ఎక్కువట!

దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లుంటే.. అందులో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది స్త్రీలు. అందులోనూ ఈసారి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటోన్న 18-19 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల సంఖ్య 85.3 లక్షలుగా ఉందని కమిషన్‌ తెలిపింది. కేరళలో అత్యధికంగా 51 శాతం మంది మహిళా ఓటర్లుంటే.. గోవా, మిజోరం, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాలు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక హరియాణా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, బిహార్‌, ఉత్తరాఖండ్‌.. తదితర రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు మరో నివేదిక పేర్కొంది. అయితే ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబంగ, బిహార్‌ రాష్ట్రాల్లో ఈసారి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువట! గత రెండు దశాబ్దాలతో పోల్చితే.. ఈ ఎన్నికల్లోనే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు.. ఇలా దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ఈసారి మహిళలూ కీలక పాత్ర పోషించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఎందుకీ పెరుగుదల?

ఈ క్రమంలో- ఈసారి మహిళా ఓటర్ల శాతం పెరగడానికి పలు కారణాలున్నాయంటున్నారు నిపుణులు.

⚛ ముఖ్యంగా దేశంలో మహిళల అక్షరాస్యత పెరగడం వల్ల చాలామంది ఓటు హక్కు ప్రాముఖ్యాన్ని తెలుసుకోగలుగుతున్నారు.

⚛ అలాగే రాజకీయాల్లో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతుండడం వల్ల ఇది పరోక్షంగా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.

⚛ ఇక మహిళలపై జరిగే హింసాత్మక ఘటనలకు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం వల్ల వారి భద్రత, హక్కుల కోసం ఓటు వేయడం తప్పనిసరి అని చాలామంది మహిళలు భావిస్తున్నారట!

⚛ ఆయా ప్రభుత్వాలు మహిళల కోసం ప్రకటించే ప్రత్యేక పథకాలు కూడా ఓటు హక్కును వినియోగించుకునే దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

⚛ తమ ఓటు హక్కును వినియోగించుకునే మహిళలపై ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా, బెదిరింపులకు పాల్పడకుండా కేంద్ర ఎన్నికల కమిషన్‌ పలు పకడ్బందీ చర్యలు తీసుకోవడం కూడా ఈసారి మహిళా ఓటర్ల సంఖ్య పెరగడానికి ఓ కారణమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోనున్నారట!

⚛ ఇక గతంతో పోల్చితే మహిళా పోలింగ్‌ బూత్‌లు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయడం, పోలింగ్‌ స్టేషన్లలో మహిళల సౌకర్యార్థం కనీస వసతులు కల్పించడం.. వంటివి కూడా ఈసారి మహిళా ఓటర్ల సంఖ్య పెరిగేందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఇటీవలే పుదుచ్చేరి ‘మాహే’ జిల్లాలోని 31 పోలింగ్‌ స్టేషన్లలో పూర్తిగా మహిళలే బాధ్యతలు నిర్వర్తించడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్