Budget 2023 : నిర్మలమ్మ మన కోసం ఏమేం తీసుకొచ్చారంటే..!

ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఇంటికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికను వేసుకుంటాం.. ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకునే క్రమంలో ముందు ముందు పెరిగే, తగ్గే ధరల్నీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు పొదుపు-మదుపుల కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన....

Published : 01 Feb 2023 21:14 IST

ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఇంటికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికను వేసుకుంటాం.. ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకునే క్రమంలో ముందు ముందు పెరిగే, తగ్గే ధరల్నీ పరిగణనలోకి తీసుకోవడంతో పాటు పొదుపు-మదుపుల కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలనూ దృష్టిలో పెట్టుకుంటాం. ఈ క్రమంలో ఏటా ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటుంది. మరి, ఈసారి బడ్జెట్‌లో యువత, మహిళల సంక్షేమం కోసం.. వారి అభ్యున్నతి కోసం నిర్మలమ్మ ఎలాంటి పథకాలు తీసుకొచ్చారో, ఇంకా ఎలాంటి అదనపు సౌలభ్యాలు కల్పించారో తెలుసుకుందాం రండి..

రెండేళ్ల పొదుపు పథకం

‘మన దేశ జనాభాలో 50 శాతం మంది మహిళలు ఇంటికే పరిమితమైతే దేశం అభివృద్ధి చెందినట్లు కాదు..’ అన్నారు మోదీ. ఈ క్రమంలోనే మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు, వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఇప్పటికే వివిధ పథకాలు ప్రవేశపెట్టారు. ఆడపిల్లలకు ఆర్థిక భరోసా అందించడంలో భాగంగా ‘లాడ్లీ స్కీమ్‌’, ‘కన్యాశ్రీ ప్రకల్ప యోజన’, ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘లాడ్లీ లక్ష్మీ యోజన’.. వంటి పథకాలు తీసుకొచ్చారు. ఇక తాజా బడ్జెట్‌లో మహిళలు-ఆడపిల్లల ఆర్థిక ప్రగతి కోసం మరో కొత్త పథకం ఆవిష్కరించారు నిర్మలమ్మ. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ అనే ఈ పొదుపు పథకంలో భాగంగా.. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పథకంలో డిపాజిట్‌ చేసిన మొత్తంపై 7.5 శాతం స్థిర వడ్డీ చెల్లిస్తారు. అవసరమైతే కాలపరిమితి పూర్తికాకముందే డబ్బును మధ్యలోనే తీసుకునే సౌలభ్యం కూడా ఇందులో కల్పించారు.

ఇక ‘సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకం’లో భాగంగా డిపాజిట్‌ పరిమితిని డబుల్‌ చేశారు నిర్మలా సీతారామన్‌. తద్వారా ప్రస్తుతం రూ. 15 లక్షలున్న పరిమితి ఇకపై రూ. 30 లక్షలకు పెంచనున్నారు.

విద్యకు పెద్దపీట!

ప్రాథమిక, ఉన్నత విద్య కోసం ఈసారి 1.12 లక్షల కోట్ల నిధుల్ని కేటాయించింది మోదీ ప్రభుత్వం. ఇప్పటివరకు ఈ రంగంలో కేటాయించిన బడ్జెట్లలో ఇదే అత్యధిక మొత్తం కావడం విశేషం. ఇందులో భాగంగా ప్రాథమిక విద్య కోసం రూ. 68,804 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ. 44,094 కోట్లు అందనున్నాయి.

అలాగే 2014లో ఆమోదం పొందిన 157 వైద్య కళాశాలలకు అనుబంధంగా 157 కొత్త నర్సింగ్‌ కళాశాలల్ని ఏర్పాటుచేయనున్నట్లు ఈ బడ్జెట్లో ప్రకటించారు నిర్మలమ్మ.

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ‘జాతీయ డిజిటల్‌ లైబ్రరీ’ని ఏర్పాటుచేయనున్నట్లు ఈసారి బడ్జెట్లో ప్రకటించారు. ఇందులో భాగంగా.. పిల్లలు తమకు కావాల్సిన పుస్తకాల్ని ఎక్కడ్నుంచైనా, ఏ భాషలోనైనా.. పొందే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాల్లో సాధారణ గ్రంథాలయాల్ని ఏర్పాటుచేసి.. దాని ద్వారా చిన్నారులకు డిజిటల్‌ లైబ్రరీ సేవలు అందుబాటులోకి తేనున్నారు.

748 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం 38,800 మంది టీచర్లను రాబోయే మూడేళ్లలో నియమించుకోనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు.

కృత్రిమ మేధ అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు నిర్మలమ్మ. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న టాప్‌-3 విద్యాసంస్థల్లో కృత్రిమ మేధకు సంబంధించిన అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. తద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానంలో దేశాన్ని అగ్రభాగాన నిలపనున్నట్లు వెల్లడించారు.

‘కౌశల్‌ వికాస్‌ యోజన’లో భాగంగా.. సాంకేతిక పరిజ్ఞానంలో యువతకు మరిన్ని అడ్వాన్స్‌డ్‌ నైపుణ్యాలు అందించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు నిర్మలమ్మ. ఈ క్రమంలో కోడింగ్‌, రోబోటిక్స్‌, డ్రోన్స్‌, మెకట్రోనిక్స్‌, ఐఓటీ, 3డీ ప్రింటింగ్‌.. వంటి సరికొత్త నైపుణ్యాల్లో వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు.. అంతర్జాతీయంగా వారు తమ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేందుకు ఊతమివ్వనున్నట్లు చెప్పుకొచ్చారు.

‘ఆరోగ్య’మే మహాభాగ్యం!

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం ఈసారి రూ. 89,155 కోట్ల నిధులు కేటాయించారు నిర్మలా సీతారామన్‌. ఇందులో భాగంగా..

మహిళల రక్షణ-సాధికారత కోసం ప్రవేశపెట్టిన ‘మిషన్‌ శక్తి’ పథకం కోసం రూ. 3,144 కోట్ల నిధులు అందించనున్నట్లు ప్రకటించారు.

ఇక పిల్లల్లో పోషకాహార లోపం, కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడానికి రూపొందించిన ‘మిషన్ సాక్షమ్‌ అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0’ కోసం.. గతేడాది కంటే రూ. 291 కోట్లు అధికంగా నిధులు కేటాయించారు.

మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గతేడాది రూపొందించిన ‘జాతీయ టెలీ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌’ కోసం ఈ బడ్జెట్లో రూ. 133.73 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే ఈసారి ఈ కార్యక్రమానికి రూ. 12.73 కోట్లు ఎక్కువగా నిధులిచ్చారు నిర్మలమ్మ.


ఏవి పెరుగుతాయి? ఏవి తగ్గుతాయి?

బడ్జెట్‌ ప్రభావం ఆయా నిత్యావసర ధరలపై పడనుంది. దీంతో ఆయా వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నట్లు ప్రకటించారు నిర్మలమ్మ.

ధరలు పెరిగేవి : బంగారం-ప్లాటినం-వెండి ధరలపై కస్టమ్స్‌ సుంకం పెంపు, రాగి తుక్కు, టైర్లు, సిగరెట్లు, హెడ్‌ఫోన్స్‌, దిగుమతి చేసుకునే కిచెన్‌ చిమ్నీలు.

ధరలు తగ్గేవి : మొబైల్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, లిథియం అయాన్‌ బ్యాటరీలు, కెమెరాలు, లెన్స్‌, ల్యాప్‌టాప్స్‌, టీవీ ప్యానల్‌ విడిభాగాలు.


ఎరుపు చీర.. సెంటిమెంట్!

ఈసారి 86 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేసిన నిర్మలమ్మ.. వివిధ అంశాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

తాజాగా ఐదోసారి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. ఎక్కువసార్లు ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారామె.

నిర్మలమ్మకు చీరలంటే అమితమైన ఇష్టం. అందులోనూ చేనేత చీరల్ని ఎక్కువగా ఇష్టపడే ఆమె.. ఈ ఐదేళ్లలో ప్రతి బడ్జెట్‌ ప్రసంగానికీ ఆ చీరల్నే ఎంచుకున్నారు. అదీ ఎరుపు, మెరూన్‌.. వంటి ముదురు రంగులతో తయారుచేసిన చీరల్ని ధరించి.. తనదైన హుందాతనాన్ని చాటుకున్నారు. ఇక ఈసారీ బంగారు జరీతో రూపొందించిన టెంపుల్‌ బోర్డర్‌ ఎరుపు రంగు చీరలో తన శారీ సెంటిమెంట్‌ను ప్రదర్శించారీ విత్త మంత్రి.

గత మూడేళ్లుగా డిజిటల్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వస్తోన్న నిర్మలమ్మ.. ఈసారీ తన డిజిటల్‌ బడ్జెట్ ప్రతులు పొందుపరిచిన ట్యాబ్‌ను.. జాతీయ చిహ్నం అమర్చిన ఎరుపు రంగు పౌచ్‌లో తీసుకొచ్చారు.

పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రతుల్ని చదివి వినిపించడమే కాదు.. మధ్యమధ్యలో స్ఫూర్తిదాయక కొటేషన్స్‌ చెబుతూ అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు నిర్మలమ్మ. ఇక ఈసారీ అలాంటి ఓ సరదా సన్నివేశంతో అక్కడున్న వారి ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయించారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్