అమ్మలు కాబోతున్న.. అందాల తారలు!

అమ్మతనంతోనే మహిళ జీవితం పరిపూర్ణమవుతుందంటారు. అలా తాజాగా తమ జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ యామీ గౌతమ్‌-ఆదిత్యధర్ ల జంట. ‘అక్షయ తృతీయ’ రోజున తమకు బాబు పుట్టాడని తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారీ లవ్లీ కపుల్‌....

Published : 21 May 2024 15:54 IST

అమ్మతనంతోనే మహిళ జీవితం పరిపూర్ణమవుతుందంటారు. అలా తాజాగా తమ జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ యామీ గౌతమ్‌-ఆదిత్యధర్ ల జంట. ‘అక్షయ తృతీయ’ రోజున తమకు బాబు పుట్టాడని తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారీ లవ్లీ కపుల్‌. యామీనే కాదు.. మరికొందరు అందాల తారలు సైతం ఈ ఏడాది అమ్మతనంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే తాము గర్భం ధరించిన విషయాన్ని వైవిధ్యంగా ప్రకటించి.. ఆ మధుర క్షణం కోసమే ఎదురుచూస్తున్నామంటున్నారు. తమ చిన్నారిని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుంటామా అని వాళ్లు ఎంతగా ఆత్రుత పడుతున్నారో వాళ్లు పెట్టే సోషల్‌ మీడియా పోస్టుల ద్వారానే తెలిసిపోతుంది. ఈ క్రమంలో త్వరలోనే అమ్మ కాబోతున్న ఆ అందాల తారలెవరో చూద్దాం రండి..

‘వేదవిద్‌’ అర్థమదే!

2021లో బాలీవుడ్‌ దర్శకుడు ఆదిత్యధర్‌తో ఏడడుగులు వేసింది ఫెయిర్‌ అండ్‌ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సినిమా ‘ఆర్టికల్‌ 370’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో భాగంగా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఇటీవలే పండంటి బాబుకు జన్మనిచ్చిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ‘అక్షయ తృతీయ’ రోజున తమకు కొడుకు పుట్టాడని, తమ చిన్నారికి వేదవిద్‌ (Vedavid) అని పేరు పెట్టుకున్నట్లు తాజాగా ప్రకటించింది.
‘అక్షయ తృతీయ శుభదినాన మాకు కొడుకు పుట్టాడు.. నన్ను, ఆదిత్యను తల్లిదండ్రులుగా మార్చి మా జీవితాల్ని సంపూర్ణం చేశాడు. మా బాబుకు వేదవిద్‌ అని పేరు పెట్టుకున్నాం.. వేదాల్లో మహా పండితుడు, శ్రీమహా విష్ణువు అని ఈ పేరుకు అర్థం! ప్రస్తుతం అమ్మగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నా.. నేను, ఆదిత్య కుటుంబానికి, కుటుంబ విలువలకు ఎంతో ప్రాధాన్యమిస్తాం. మా చిన్నారికీ అలాంటి విలువల్నే నేర్పించాలనుకుంటున్నాం. ఇక గర్భిణిగా ఉన్న సమయంలోనూ నేను నా వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగా. ఈ దశలో ఆదిత్య నా పక్కనే ఉంటూ నా మంచిచెడ్డలు చూసుకోవడం, మా కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు నన్ను మరింత సౌకర్యంగా ప్రెగ్నెన్సీని ఆస్వాదించేలా చేశాయి. ఇక ఈ సమయంలో ఏది చేయాలి? ఏది చేయకూడదు? వంటి విషయాల్లో పెద్దల సలహాలు తీసుకున్నానే తప్ప.. ఆన్‌లైన్‌లో శోధిస్తూ అనవసరంగా టెన్షన్‌ పడలేదు..’ అంటోందీ న్యూమామ్‌. కొత్తగా తల్లిదండ్రులైన ఈ జంటకు ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెల్తుతున్నాయి.


1+1=3!

మలయాళీ కుట్టి అమలాపాల్‌ ప్రస్తుతం తొమ్మిది నెలల నిండు గర్భిణి. తాను తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంతగా ఎంజాయ్‌ చేస్తోందో చెప్పడానికి ఆమె సోషల్‌ మీడియా పోస్టులే ప్రత్యక్ష నిదర్శనం! ప్రసవ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరింత యాక్టివ్‌గా మారిపోతోన్న అమల.. నిండు గర్భంతోనే డ్యాన్స్‌ చేస్తూ.. గర్భధారణ అనారోగ్యం కాదని నిరూపిస్తోంది. అంతేకాదు.. పలు యోగాసనాలు సాధన చేస్తూ.. మహిళలందరికీ ప్రెగ్నెన్సీ టిప్స్‌ కూడా అందిస్తోంది.
ఇటీవలే మలాసనం వేసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ‘ప్రెగ్నెన్సీలో మలాసనం ఎంతో మేలు చేస్తుంది. కటి వలయం కండరాల్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చి ప్రసవాన్ని మరింత సులభతరం చేస్తుంది..’ అంటూ రాసుకొచ్చింది.
ఇదే కాదు.. తన ప్రెగ్నెన్సీ జర్నీలో తన భర్త జగత్‌ దేశాయ్‌ పాత్ర కీలకమంటోంది అమల. ‘రాత్రుళ్లు నాకోసం మేల్కొని ఉండడం.. నాకు అసౌకర్యంగా అనిపించినప్పుడల్లా నీ మాటలు, చేతలతో ఆ ఫీలింగ్‌ని దూరం చేయడం.. సరదాగా ఉంటూ నన్ను నవ్వించడం.. ఈ తొమ్మిది నెలల ప్రయాణం నీ వల్లే ఇంత సాఫీగా, సౌకర్యవంతంగా సాగింది డియర్‌! ప్రతి విషయంలోనూ నాకు అండగా ఉంటూ, నాలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నింపినందుకు థ్యాంక్యూ.. ఐలవ్యూ!’ అందీ బ్యూటీ. గతేడాది నవంబర్‌లో పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. ఈ ఏడాది జనవరిలో ‘1+1=3’ అంటూ తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్‌ చేసింది. అప్పట్నుంచి కాబోయే తల్లిదండ్రులుగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, ఆ ఫొటోలు/వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారీ లవ్లీ కపుల్‌. ఇక ఈమధ్యే తన సీమంతం ఫొటోల్నీ అమల ఇన్‌స్టాలో పంచుకోగా, అవి వైరల్‌గా మారాయి.


దీప్‌వీర్‌.. సెప్టెంబర్ బేబీ!

‘ఎప్పుడు గుడ్‌న్యూస్‌ చెబుతారు?’ అంటూ ఫ్యాన్స్‌ పదే పదే అడిగిన ప్రశ్నకు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమాధానమిచ్చారు బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌. 2018లో పెళ్లిపీటలెక్కిన ఈ జంట.. ‘సమాజం కోసం కాకుండా.. తమకు కావాల్సినప్పుడే పిల్లల్ని కంటామ’ని గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అయితే ఆ క్షణం రానే వచ్చింది. తాము త్వరలోనే ముగ్గురం కాబోతున్నామంటూ ఫిబ్రవరిలో తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్‌ చేసిందీ ముద్దుల జంట. పసిపిల్లల దుస్తులు, చెప్పులు, ఇతర యాక్సెసరీస్‌తో కూడిన చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ జంట.. సెప్టెంబర్‌లో తమ చిన్నారి రాబోతుందంటూ ప్రకటించి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది.
అయితే ప్రస్తుతం రెండో త్రైమాసికంలో ఉన్న దీపిక.. ఈ సమయంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నానని చెబుతోంది.
‘కెరీర్‌, షూటింగ్స్‌ అన్నీ పక్కన పెట్టేశా.. ప్రెగ్నెన్సీని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. శారీరక, మానసిక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నా. ఈ క్రమంలో అమ్మ, అత్తయ్య చెప్పిన చిట్కాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గర్భిణిగా ఉన్న సమయంలో ఏ భార్యైనా తన భర్త పక్కనే ఉండాలని, తనను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకుంటుంది. ప్రస్తుతం రణ్‌వీర్‌ నన్ను అలాగే చూసుకుంటున్నాడు. ఇలా ఈ దశను ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నా..’ అంది దీప్స్‌. గర్భం ధరించినప్పట్నుంచి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ.. ఒకవేళ బయటికొచ్చినా వదులైన దుస్తులతో తన బేబీబంప్‌ని కవర్‌ చేసుకుంటోంది. మరోవైపు మేకప్‌, హెయిర్‌కేర్‌ ఉత్పత్తులకూ దూరంగా ఉంటూ కడుపులో పెరుగుతున్న తన చిన్నారిపై ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండా మరింత శ్రద్ధ వహిస్తోందీ కాబోయే అమ్మ.


ఇదో అందమైన ప్రయాణం!

ఇటీవలే ‘హీరామండి’తో మన ముందుకొచ్చింది రిచా చద్దా. 2020లో నటుడు అలీ ఫజల్‌తో ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టింది. ఒక చిన్న కాగితంపై 1+1=3 అని రాసి.. ‘చిన్ని గుండె చప్పుడే.. ఇప్పుడు మాకు అత్యంత బిగ్గరగా వినిపిస్తోంది..’ అంటూ తనదైన రీతిలో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది రిచా.
‘నేను, అలీ ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని ఉతాలో జరిగిన సన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వెళ్లాం. ఆ సమయంలో నా ప్రెగ్నెన్సీ విషయం మా ఇద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు. అయితే ఆ సమయంలో అక్కడి వాతావరణం ఎంతో ప్రతికూలంగా ఉంది. అత్యల్ప ఉష్ణోగ్రతలకు తోడు ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. అయినా ధైర్యంగా ముందుకెళ్లా. ఇక తిరిగొచ్చాక ఈ గుడ్‌న్యూస్‌ని అందరితో పంచుకున్నాం. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచే కాదు.. ఫ్యాన్స్‌ నుంచీ ఎన్నో సలహాలు, చిట్కాలు పొందాను. అమ్మతనం అనేది ఓ అందమైన ప్రయాణం.. ఎన్నో మధురానుభూతుల సమాహారం! ఇక అలీ లాంటి అర్థం చేసుకునే, కేరింగ్‌గా చూసుకునే భాగస్వామి దొరకడం నా అదృష్టం! ప్రస్తుతం మా బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం..’ అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకుందీ కాబోయే అమ్మ.

వీళ్లతో పాటు నటి-మోడల్‌ అలానా పాండే, ఫ్యాషనర్‌ మసాబా గుప్తా, బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ సతీమణి నటాషా దలాల్‌.. కూడా ఈ ఏడాది అమ్మగా ప్రమోషన్‌ పొందబోతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్