Srilanka Crisis: ప్రధాని కార్యాలయంలోకి నిరసనకారులు.. ‘బాహుబలి’ని తలపించిన దృశ్యాలు..!

సంక్షోభ పరిస్థితులతో విసుగెత్తిన శ్రీలంక ప్రజలు.. సరికొత్త నాయత్వాన్ని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను గద్దె దింపేందుకు గట్టిగా పోరాడిన వారంతా.. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Published : 14 Jul 2022 02:11 IST

కొలంబో: సంక్షోభ పరిస్థితులతో విసుగెత్తిన శ్రీలంక ప్రజలు.. సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను గద్దె దింపేందుకు గట్టిగా పోరాడిన వారంతా.. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గొటబాయ దేశం దాటిన వార్తలతో ఈ రోజు ఉదయం పెల్లుబికిన ప్రజాగ్రహం.. ప్రధాని కార్యాలయం వైపు దూసుకెళ్లింది. బాష్పవాయువు గోళాలు, జల ఫిరంగులను లెక్కచేయకుండా కొలంబోలోని ప్రధాని కార్యాలయంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు. భవనంపైకి చేరుకొని జెండాలు ఎగరవేశారు. ఈ క్రమంలో ప్రాంగణంలో ఇసుకేస్తే రాలనంతమంది జనం కనిపించారు. ఇదిలా ఉంటే.. ఆ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు వారు గేట్లు తెరిచిన తీరు బాహుబలి సన్నివేశాన్ని తలపించింది. అంతా కలిసి ఒక పెద్ద కర్ర పట్టుకొని బలంగా నెడుతూ గేట్లు తెరిచారు. దానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి మీడియాలో దర్శనమిచ్చాయి. 

ఈ క్రమంలో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రణిల్ విక్రమసింఘే మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి ఫాసిస్టుల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో శాంతి భద్రతలు పునరుద్ధరిస్తామని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. ‘ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ఫాసిస్టు ముప్పును మనం అంతం చేయాలి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని అనుమతించం. అధ్యక్షుడి నివాసం, కార్యాలయం, ప్రధాని నివాసం..తగిన వ్యక్తుల స్వాధీనంలోకి రావాలి. నా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన కొందరు.. అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఫాసిస్టులను అనుమతించం. ప్రధాన స్రవంతిలో ఉన్న నాయకులు వీరికి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ, కర్ఫ్యూ ప్రకటించాను’ అని వెల్లడించారు. నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో శ్రీలంక ప్రభుత్వ టీవీ ఛానల్ కొద్దిసేపు ప్రసారాలు నిలిపివేసింది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు