Afghanistan: దురాక్రమణను ఇక సహించం.. పాకిస్థాన్‌కు తాలిబన్ల హెచ్చరిక

తమ ప్రాంతంపై దురాక్రమణలకు పాల్పడితే సహించేది లేదని అఫ్గాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Published : 25 Apr 2022 16:26 IST

సరిహద్దులో వైమానిక దాడులపై స్పందించిన అఫ్గానిస్థాన్‌

కాబుల్: తమ ప్రాంతంపై దురాక్రమణలకు పాల్పడితే సహించేది లేదని అఫ్గాన్‌ తాలిబన్లు పాక్‌ను హెచ్చరించారు. ముఖ్యంగా సరిహద్దు దేశం నుంచి జరిగినట్లు భావిస్తోన్న వైమానిక దాడిని తీవ్రంగా ఆక్షేపించింది. అఫ్గాన్‌లోని కునార్‌, ఖోస్ట్‌ ప్రావిన్సుల్లో వైమానిక దాడుల కారణంగా పదుల సంఖ్యలో పౌరుల మరణానికి పాకిస్థాన్‌ దాడులే కారణమని తాలిబన్‌ ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఈ దాడుల్లో తమ పాత్ర ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ధ్రువీకరించని పాకిస్థాన్‌.. రెండు దేశాలు మిత్రదేశాలంటూ హితవు పలికింది.

‘మా పొరుగు దేశంతో పాటు యావత్‌ ప్రపంచం నుంచి సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇందుకు తాజాగా కునార్‌ ప్రావిన్సులో జరిగిన దురాక్రమణే స్పష్టమైన ఉదాహరణ. అయితే, ఇటువంటి దండయాత్రలను సహించలేం. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ దాడిని మాత్రం సహించాం. మరోసారి ఇటువంటి ప్రయత్నం జరిగితే సహించే ప్రసక్తే లేదు’ అని అఫ్గాన్‌ రక్షణ మంత్రిగా వ్యవహరిస్తోన్న ముల్లా మొహమ్మద్‌ యాకూబ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు పరోక్ష హెచ్చరిక చేశారు. ఇదే విషయంపై మాట్లాడిన పాకిస్థాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి.. శాంతి పరిరక్షణలో అఫ్గాన్‌తో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

అఫ్గాన్‌లోని కునార్‌, ఖోస్త్‌ ప్రావిన్సుల్లో ఏప్రిల్‌ 16న వైమానిక దాడులు జరిగాయి. పాకిస్థానీ సైనిక హెలికాప్టర్‌ జరిపిన ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్‌ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో 20 మంది చిన్నారులు మరణించినట్లు ఐరాస కూడా పేర్కొంది. ఇందుకు పాకిస్థాన్‌ సైన్యమే కారణమని అఫ్గాన్‌ ఆరోపిస్తోంది.

ఇదిలాఉంటే, గతేడాది ఆగస్టులో అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు వరుస సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వారి ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఇంకా గుర్తించలేదు. మరోవైపు పాకిస్థాన్‌తో సరిహద్దు విషయంలోనూ ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌ దాడులను ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని