Brain Implant: కలల నియంత్రణకు స్వయంగా బ్రెయిన్‌లో ‘చిప్‌’.. చివరకు చావు అంచులకు..!

కలల నియంత్రణ కోసం ఓ వ్యక్తి సొంతగా ఆపరేషన్‌ చేసుకుని మెదడు వద్ద చిప్‌ను అమర్చుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావం కాగా, చివరకు ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Published : 22 Jul 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కలలను నియంత్రించాలనే లక్ష్యంతో ఓ వ్యక్తి చేసిన ప్రమాదకర పని.. అతడిని చావు అంచులకు తీసుకెళ్లింది. డ్రిల్లింగ్‌ యంత్రం సాయంతో తన తలకు తానే రంధ్రం చేసుకుని.. మెదడు వద్ద చిప్‌ అమర్చుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావానికి గురైన అతడిని ఆస్పత్రిలో చేర్చడంతో చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానిక వార్తాసంస్థల వివరాల ప్రకారం.. కజకిస్థాన్‌కు చెందిన మిఖాయిల్‌ రాదుగా(40) అనే వ్యక్తి తన కలలను నియంత్రించాలని భావించాడు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించడంతోపాటు న్యూరో సర్జరీల వీడియోలు చూశాడు.

ఇటీవల ఓ డ్రిల్లింగ్‌ మిషన్‌ కొనుక్కొని.. తనపై తాను ప్రయోగం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంట్లోనే ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే స్వయంగా కపాలానికి రంధ్రం చేసుకున్నాడు. ఆపై ఎలక్ట్రోడ్‌ చిప్‌ను అమర్చుకున్నాడు. అయితే, నాలుగు గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. దాదాపు లీటర్‌ రక్తం కోల్పోవడంతో అది కాస్త ప్రాణాల మీదికి వచ్చింది. చివరకు ఆస్పత్రిలో చేర్చడంతో బతికి బయటపడ్డాడు. తాను చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఫొటోలను అతడు ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు.

మనిషి మెదడులో చిప్‌.. న్యూరాలింక్‌ ప్రయోగాలకు గ్రీన్‌సిగ్నల్‌

‘మెదడుపై స్వయంగా ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్ చేశాను. తద్వారా మెదడులోని ఓ భాగంలో ఎలక్ట్రిక్‌ స్టిమ్యులేషన్‌ నిర్వహించాను. కలలు కనేటప్పుడు మెదడు ఉద్దీపనను పరీక్షించడానికి ఇది అవసరం. ఇటువంటి ప్రయోగం చరిత్రలో ఇదే మొదటిసారి’ అని అతడు పేర్కొనడం గమనార్హం. ఈ ప్రయోగ ఫలితాలు.. కలల నియంత్రణ సాంకేతికతలకు అవకాశాల ద్వారాలను తెరుస్తాయని చెప్పాడు. వాస్తవానికి ఈ శస్త్రచికిత్స కోసం మొదట్లో న్యూరో సర్జన్లను సంప్రదించాలని భావించినా.. వారిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో స్వయంగా చేసుకున్నట్లు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని