Australia: మొన్న కమ్యూనికేషన్లు.. నేడు ఓడరేవులు.. ఆస్ట్రేలియాపై భారీ సైబర్‌ దాడి

ఆస్ట్రేలియాలో సైబర్‌ దాడుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా ఆ దేశ రెండో అతిపెద్ద పోర్టు ఆపరేటర్‌ డీపీ గ్లోబల్‌ ఆస్ట్రేలియా విభాగం ఇప్పుడు హ్యాకర్లకు లక్ష్యంగా మారింది. ఫలితంగా అక్కడ ఇంటర్నెట్‌ సేవలను దాదాపు మూడు రోజులు పూర్తిగా నిలిపేశారు. తాజాగా వాటిని పునరుద్ధరించారు. 

Updated : 13 Nov 2023 10:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద పోర్టు ఆపరేటర్‌ సైబర్‌ దాడికి గురైంది. దీంతో ఈ సంస్థ వెబ్‌సైట్లు కొన్ని రోజులపాటు మూతపడ్డాయి. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధికారులు ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా ఎగుమతులు, దిగుమతుల్లో 40శాతం సరుకుల సముద్ర రవాణాను డీపీ వరల్డ్‌ ఆస్ట్రేలియా సంస్థ చూసుకుంటుంది. దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్‌కు ఇది అనుబంధ సంస్థ. ఇది దేశ ప్రధాన పోర్టుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. దీని ఆధీనంలో మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్బన్‌, పెర్త్‌, ఫ్రెమాంట్లె వంటి ప్రధాన పోర్టుల టెర్మినళ్లు ఉన్నాయి.

రక్షణ కవచాలుగా పౌరులు,ఆసుపత్రులు.. హమాస్‌ తీరును ఖండించిన ఈయూ

డీపీ వరల్డ్‌ ఆస్ట్రేలియా సైబర్‌ దాడికి గురైన విషయం శుక్రవారం బయటపడింది. దీంతో సరుకు ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడినట్లు సమాచారం. ఫలితంగా పలు భారీ నౌకలు అన్‌లోడింగ్‌ కాకుండానే తీరంలో నిలిచిపోయాయి. దీంతో తమ ఉద్యోగులు, కస్టమర్లు, నెట్‌వర్క్‌ల వ్యవస్థను సంరక్షించడానికి చర్యలు తీసుకొన్నామని ఆ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా కీలక నెట్‌వర్క్‌ల నుంచి ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేశామని  తెలిపింది. ఫలితంగా చాలా వ్యవస్థలు సాధారణ స్థాయిలో పనిచేయలేదు. కొద్ది సేపటి క్రితం డీపీ వరల్డ్‌ సంస్థ అన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. 

ఈ పరిస్థితిపై సంస్థ ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ డారెన్‌ గోల్డీ మాట్లాడుతూ ‘‘ఆ సంస్థ వేగంగా దాడి నుంచి కోలుకుంటోంది. తన వెబ్‌సైట్లను వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితి కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది’’ అని వెల్లడించారు. ఇక నిందితులను ప్రభుత్వం గుర్తించలేదని ఆయన వెల్లడించారు. 

తమ పోర్టుల్లో శుక్రవారం ఇంటర్నెట్‌ వినియోగాన్ని పూర్తిగా నిలిపేశామని డీపీ వరల్డ్‌ ప్రకటించింది. అనుమతులు లేని కార్యకలాపాలను అడ్డుకోవడానికే ఇలా చేసినట్లు వెల్లడించింది.  ఫలితంగా ట్రాన్స్‌పోర్టు ట్రక్కులు కంటైనర్లను తీసుకెళ్లలేకపోతున్నాయని సంస్థ డైరెక్టర్‌ బ్లేక్‌ టియర్నీ వెల్లడించారు. సోమవారం ఉదయం ‘పోర్ట్స్‌ ఆస్ట్రేలియా’ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. ‘డీపీ వరల్డ్‌ టెర్మినళ్లలో అదే పరిస్థితి కొనసాగుతోంది’ అని పేర్కొంది. మిగిలిన సంస్థల ఆధీనంలోని ఆస్ట్రేలియా ఓడరేవుల టెర్మినళ్లు సాధారణంగానే పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కలిసి డీపీ వరల్డ్‌ పనిచేస్తోందని పేర్కొంది. 

ఇటీవలే గుర్తుతెలియని కారణాలతో ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద టెలికమ్యూకేషన్స్‌ సంస్థ ఆప్టస్‌లో తీవ్ర సాంకేతిక సమస్య ఎదురైంది. దాదాపు కోటి మంది కస్టమర్లకు ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలు నిలిచిపోయాయి. గతేడాది కూడా ఈ సంస్థకు చెందిన డేటా లీకైంది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అది అతిపెద్ద డేటా లీక్‌గా నిలిచింది. అప్పట్లో దీనికి సైబర్‌ దాడే కారణమని అనుమానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని