EU: రక్షణ కవచాలుగా పౌరులు,ఆసుపత్రులు.. హమాస్‌ తీరును ఖండించిన ఈయూ

గాజా(Gaza)లో ఆసుపత్రులు, పౌరులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్న హమాస్‌(Hamas) తీరును యురోపియన్‌ యూనియన్‌(EU) ఖండించింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షితంగా మరోచోటుకి తరలివెళ్లేలా అనుమతి ఇవ్వాలని ఈయూ విదేశాంగ విధాన చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ సూచించారు. 

Updated : 13 Nov 2023 08:35 IST

బెల్జియం: గాజా(Gaza)లో ఆసుపత్రులను, పౌరులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్న తీరుపై హమాస్‌(Hamas) చర్యలను యురోపియన్‌ యూనియన్‌(EU) ఖండించింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి పౌరులు భద్రంగా వెళ్లేలా చూడాలని హమాస్‌కు సూచించింది. ఉత్తరగాజాపై హమాస్‌ పట్టు కోల్పోయిందని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించి బందీలను కాపాడతామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న పలు ఆసుపత్రులను ఐడీఎఫ్‌ దళాలు చుట్టుముట్టాయి. వీటిలో గాజాలో అతిపెద్దదైన అల్‌-షిఫా, రెండో అతిపెద్దదైన అల్‌-ఖుద్స్‌ ఉన్నాయి. దీంతో ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, మందుల సరఫరా కష్టతరం అవుతోంది.

ఈ నేపథ్యంలో ఈయూ విదేశాంగ విధాన చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజలను, ఆసుపత్రులను హమాస్‌ రక్షణ కవచాలుగా ఉపయోగించుకోవడాన్ని ఖండిస్తున్నాం. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షితంగా మరోచోటుకి తరలివెళ్లేలా అనుమతి ఇవ్వాలి’’ అని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో మరింత సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌ను ఆయన కోరారు. అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం బాధ్యతగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని రక్షించడానికి, మందుల సరఫరా చేసేందుకు ఆటంకం కలిగించకుండా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అత్యవసర మందుల సరఫరాతో పాటు, అత్యవసర వైద్య సదుపాయం కావాల్సిన రోగులను భద్రంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా చూడాలని ఇజ్రాయెల్‌కు ఆయన సూచించారు. ఇలాంటి శత్రుత్వాలు ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, పౌరులు, వైద్య సిబ్బంది తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌ దళాలు పలు ఆసుపత్రులను చుట్టుముట్టడంతో వైద్యపరికరాలు, మందుల సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలువురు రోగులు వైద్య సహాయం అందక మృత్యువాత పడుతున్నట్లు వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే హమాస్‌ మిలిటెంట్లు పలువురిని రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయెల్‌ పేర్కొంటోంది. ఆసుపత్రుల కింద, సమీప ప్రాంతాల్లో హమాస్‌ కమాండ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసిందని తెలిపింది. అయితే ఇజ్రాయెల్‌ వ్యాఖ్యలను హమాస్‌ ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని