China: పెళ్లిళ్లు, సంతానోత్పత్తిని ప్రోత్సహించేందుకు చైనాలో సరికొత్త ప్రాజెక్టు

చైనాలో తగ్గిపోతున్న జననాల రేటును అడ్డుకొనేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టింది.  

Updated : 15 May 2023 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China) వీలైనంత వేగంగా జనాభా పెంచేందుకు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా దేశంలోని 20 నగరాల్లో కొత్తతరం (న్యూఎరా ) పెళ్లిళ్లు, సంతోనోత్పత్తి సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమాలను మొదలుపెట్టనుంది. దేశంలో సంతానోత్పత్తి రేటును పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. చైనా ఫ్యామిలీ ప్లానింగ్‌ అసోసియేషన్‌ సంస్థ  వీటిని సిద్ధం చేసింది. ముఖ్యంగా మహిళలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కనేట్లు ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని గ్లోబల్‌ టైమ్స్‌ (Global Times) కథనంలో పేర్కొంది.

ఈ సరికొత్త ప్రాజెక్టు కింద సరైన సమయంలో యువతీయువకులకు పెళ్లిళ్లు అయ్యేట్లు చూడటం, పిల్లల బాధ్యతలను భార్యభర్తలు పంచుకొనేలా చేయడం, పెళ్లికూతుళ్లకు చెల్లించే అధిక కట్నాలు  అడ్డుకోవడం, ఇతర ఆచారాలను పరిరక్షించడం వంటివి చేపట్టనున్నారు. యువతరానికి పెళ్లి, పిల్లలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు డెమోగ్రాఫర్‌ హెయాఫు గ్లోబల్‌ టైమ్స్‌కు వెల్లడించారు. మరోవైపు చైనాలోని పలు రాష్ట్రాల్లో జననాల రేటును పెంచేందుకు ఆయా ప్రభుత్వాలు పన్నరాయితీలు, గృహాలపై సబ్సిడీలు, మూడో బిడ్డను కంటే రాయితీ విద్య వంటి సౌకర్యాలను కల్పించారు. 

1980-2015 వరకు చైనాలో వన్‌ఛైల్డ్‌ పాలసీని బలవంతంగా అమలు చేశారు. ఫలితంగా జననాల రేటు పడిపోతూ వచ్చింది. ఇటీవల కాలంలో ఇది ప్రమాదకర స్థాయికి చేరుకొంది. గత 60 ఏళ్లలో తొలిసారి జననాల రేటు పడిపోయింది. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం దీనిని అడ్డుకోవడానికి చర్యలు చేపట్టింది. ఈ ఏడాది మార్చిలో అండాలను భద్రపర్చుకోవడానికి, ఐవీఎఫ్‌ చికిత్సలకు కూడా అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనలను కూడా పరిశీలించింది. అక్కడి ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా.. మహిళలు మాత్రం పెరిగిన జీవన వ్యయాల కారణంగా సంతానోత్పత్తికి మొగ్గు చూపడంలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని