Bank Glitch: బ్యాంక్‌లో సాంకేతిక లోపం.. రూ.350 కోట్లు ఖాళీ చేసిన వినియోగదారులు!

ఓ బ్యాంకులో సాంకేతిక లోపాన్ని అవకాశంగా తీసుకున్న ఖాతాదారులు ఏకంగా రూ.350 కోట్ల మేర ఖాళీ చేసినట్లు సమాచారం.

Published : 19 Mar 2024 23:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సాంకేతిక లోపం.. ఓ బ్యాంకుపాలిట శాపంగా మారింది! తమ ఖాతాల్లోని నగదు కంటే ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసేందుకు వినియోగదారులకు అవకాశం లభించడంతో.. వారంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. బ్యాంకు నుంచి ఏకంగా రూ.350 కోట్ల మేర ఖాళీ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆ మొత్తాన్ని రాబట్టుకునే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా (Ethiopia)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

నాలుగు కోట్ల మంది వినియోగదారులతో కూడిన ‘కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇథియోపియా’ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌. ఈ క్రమంలోనే శనివారం తమ ఖాతాల్లోని నగదు కంటే ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా అవుతోందని గుర్తించిన వినియోగదారులు.. దేశవ్యాప్తంగా ఏటీఎంల ముందు బారులు తీరారు. ఈ విషయాన్ని తొలుత ఓ యూనివర్సిటీ విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారని, వారే చాలావరకు డబ్బు తీశారని బ్యాంక్ సీఈవో అబె సనో తెలిపారు.

‘లావుగా ఉన్నామని విమానం నుంచి దించేశారు’

ఎంత నగదు ఉపసంహరించారో వెల్లడించనప్పటికీ.. ఆ సమయంలో దాదాపు ఐదు లక్షల లావాదేవీలు జరిగినట్లు అబె సనో చెప్పారు. అయితే.. దాదాపు 2.4 బిలియన్ల ఇథియోపియన్ బిర్‌ (రూ.350 కోట్లు)ల మేర కోల్పోయినట్లు ఓ స్థానిక వార్తాసంస్థ పేర్కొంది. సైబర్ దాడి జరగలేదని, రోజువారీ సిస్టమ్ అప్‌డేట్, తనిఖీల సమయంలోనే సాంకేతిక సమస్య తలెత్తిందని ఇథియోపియా సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. బ్యాంకింగ్‌ వ్యవస్థను నిలిపేసి, లోపాన్ని సరిదిద్దారు. సొమ్మును తిరిగి రాబట్టేందుకు పోలీసులతో కలిసి పని చేస్తున్నట్లు అబే వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని