UN chief: సన్నిహితుల చేతుల్లోనే.. ప్రతి 11 నిమిషాలకు ఓ మహిళ బలి

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ తన సన్నిహితులు, కుటుంబీకుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.

Published : 22 Nov 2022 15:00 IST

ఐరాస: మహిళలపై కొనసాగుతోన్న వివక్ష, హింసపై ఐక్యరాజ్య సమితి (United Nations) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11నిమిషాలకు ఓ మహిళ/బాలిక తన సన్నిహితులు లేదా సొంత కుటుంబీకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురవుతోందని పేర్కొంది. అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింసే అత్యంత విస్తృతమైందని అభిప్రాయపడింది. ‘మహిళలపై హింస నిర్మూలన దినం’ (నవంబర్‌ 25న) పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలు, బాలికలపై జరుగుతోన్న హింసే అత్యంత విస్తృతమైంది. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ/బాలిక తన సన్నిహితులు లేదా సొంత కుటుంబీకుల చేతుల్లోనే బలి అవుతోంది. కరోనా మహమ్మారి మొదలు ఆర్థిక సంక్షోభం వరకు వారిపై భౌతికంగా, మౌఖిక దాడులు మరింత పెరుగుతున్నాయి’ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. మహిళలు/బాలికలపై ఆన్‌లైన్‌ హింస కూడా ప్రబలంగా ఉందన్న ఆయన.. లైంగిక వేధింపులతోపాటు మహిళల వస్త్రధారణ, ఫొటోల వంటి విషయాల్లో ఎన్నో రకాలుగా దాడులు కొనసాగుతున్నాయన్నారు.

మహిళలపై జరుగుతోన్న హింసను ఇక చరిత్ర పుస్తకాల్లోకి పంపాలన్న ఐరాస చీఫ్‌.. ఇందుకు ప్రపంచ దేశాలు శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఇందుకోసం ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో మహిళా హక్కుల సంస్థలకు ఎక్కువ మొత్తంలో నిధులు పెంచాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని