Mexico-US Border: శరణార్థి శిబిరంలో ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి..!

మెక్సికో నగరం(Mexican city)లోని శరణార్థి శిబిరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదులో సంఖ్యలో శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు. 

Updated : 28 Mar 2023 17:37 IST

సిడెడ్ జారే(మెక్సికో): అమెరికా సరిహద్దు( Mexico-US Border)లో మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సిడెడ్ జారే(Ciudad Juarez) నగరంలోని శరణార్థి శిబిరం(Migrant Center)లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. 

ఈ మెక్సిన్‌ నగరంలోని నేషనల్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్‌(INM) సిబ్బంది అగ్నిప్రమాదాన్ని ధ్రువీకరించారు. 39 మంది చనిపోయినట్టు వెల్లడించారు. ఈ ఐఎన్‌ఎం శిబిరంలోని పార్కింగ్ స్థలంలో పదుల సంఖ్యలో మృతదేహాలను దుప్పట్లలో కప్పి ఉంచినట్లు సదరు వార్తా సంస్థ పేర్కొంది.  29 మందికి గాయాలైనట్లు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ప్రమాద సమయంలో ఈ శిబిరంలో 70 మంది శరణార్థులు ఉన్నట్లు, వారిలో అధికులు వెనిజువెలాకు చెందిన వారని తెలుస్తోంది. ఈ శిబిరం స్టాంటన్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్‌కు దగ్గర్లో ఉంటుంది. ఇది సిడెడ్ జారే నగరాన్ని అమెరికాలోని టెక్సాస్‌తో కలుపుతుంది. ఈ ప్రాంతం మీదుగా వేలసంఖ్యలో వలసవెళ్తుంటారు. ఇటీవల కాలంలో అందులో ఎక్కువమంది వెనిజువెలాకు చెందినవారే ఉన్నారు. వీరంతా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించి, తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(IOM)తాజా నివేదిక ప్రకారం.. 2014 నుంచి అమెరికా ఆశలతో పయనమైన 7,661 మంది  శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు/కనిపించకుండా పోయారు. అందులో అత్యంత దారుణ స్థితిలో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురైన వారి సంఖ్య 988గా ఉందని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని