ముచ్చటగా మూడోసారి.. చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్‌

ప్రపంచంలో రెండో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా అవతరించిన చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌(69) సరికొత్త చరిత్ర లిఖించారు. ముచ్చటగా మూడోసారి ఆ దేశాధ్యక్ష పదవిని చేపట్టారు.

Published : 11 Mar 2023 06:01 IST

పార్లమెంటు ఏకగ్రీవ ఆమోదం
జీవితాంతం ఆ పదవిలో కొనసాగే అవకాశం!
మావోతో సమాన స్థాయి ప్రాధాన్యం

బీజింగ్‌: ప్రపంచంలో రెండో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా అవతరించిన చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌(69) సరికొత్త చరిత్ర లిఖించారు. ముచ్చటగా మూడోసారి ఆ దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు ఆయనకు అత్యున్నత అధికార బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంటు....నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌పీసీ) శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

గతేడాది అక్టోబరులో జరిగిన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) మహాసభ  జిన్‌పింగ్‌ను మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో సీపీసీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మావో తర్వాత రెండు దఫాలకు మించి పార్టీ పగ్గాలు అందుకున్న తొలి నేతగా జిన్‌పింగ్‌ ఘనత సాధించారు. సాధారణంగా సీపీసీ నిర్ణయాలనే యథాతథంగా అమలు చేస్తూ ‘రబ్బర్‌ స్టాంప్‌ పార్లమెంటుగా పేరొందిన ఎన్‌పీసీ.. జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా శుక్రవారం ఎన్నుకుంది. మొత్తం 2,952 మంది సభ్యులు ఆయనకు ఏకగ్రీవంగా మద్దతుపలికారు. ఈ ఎన్నిక తర్వాత.. జిన్‌పింగ్‌ రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు హన్‌ ఝెంగ్‌ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నూతన ప్రధాని ఎన్నిక శనివారం జరగనుంది. ప్రస్తుత ప్రధాని లీ కచియాంగ్‌ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో లీ చియాంగ్‌ ఎన్నిక కావచ్చని తెలుస్తోంది.

కెమికల్‌ ఇంజినీర్‌ నుంచి..

జిన్‌పింగ్‌ తండ్రి షి ఝాంగ్‌షన్‌... మావో జెడాంగ్‌ ప్రభుత్వంలో ఉప ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, ఉదారవాద విధానాలు అనుసరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో పదవి కోల్పోయారు. ఆయనను జైలులో పెట్టారు. అప్పటికి జిన్‌పింగ్‌కు 13 ఏళ్లు. తండ్రి మీద వచ్చిన అపవాదుల ప్రభావం ఆ కుర్రాడిపై తీవ్రంగానే పడింది. జీవితంలో రాటుదేలేలా చేసింది. పలు ప్రయత్నాల తర్వాత 1974లో జిన్‌పింగ్‌ చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొందగలిగారు. 1975లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు. జానపద గాయని పెంగ్‌ లియువాన్‌ను వివాహమాడారు. వీరికి ఒక కుమార్తె షీ మింగ్జే.

2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్‌ తొలిసారి నియమితులయ్యారు. అప్పటి నుంచి గత పదేళ్ల పదవీకాలంలో ఆయన.. చైనా కమ్యూనిస్టు పార్టీ అధినాయకుడు మావో జెడాంగ్‌ తరవాత అంతటి శక్తిమంతమైన నేతగా ఆవిర్భవించారు. చైనాలో ఉన్నత నాయకులెవరూ రెండుసార్లకు మించి పదవిలో కొనసాగకూడదనీ, మావో తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్‌ జియావోపింగ్‌ నిర్దేశించారు. ఈ నిబంధనను మారుస్తూ 2018లో చైనా పార్లమెంటు రాజ్యాంగంలో కీలక సవరణ చేసింది. దీంతో రెండు పర్యాయాల పదవీకాల పరిమితి నుంచి దేశాధ్యక్షుడికి మినహాయింపు కల్పించింది. 2021లో జరిగిన సీపీసీ ప్లీనరీ సమావేశంలో.. చైనాకు జీవితకాల అధినాయకుడిగా జిన్‌పింగ్‌ను నియమించేందుకు వీలుగా తీర్మానించారు.


అధికారాలన్నీ జిన్‌పింగ్‌ చేతుల్లోనే..

ఇరవై లక్షల మందికి పైగా సైనికులతో ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా గుర్తింపు పొందిన చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి అధిష్ఠానంగా భావించే కేంద్ర మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గానూ జిన్‌పింగ్‌నే ఎన్నుకుంటూ పార్లమెంటు తీర్మానించింది. దీంతో అధికారాలన్నీ మళ్లీ జిన్‌పింగ్‌ చేతుల్లోకే వెళ్లాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా, మిలిటరీ కమిషన్‌ ఛైర్మన్‌గా చైనాలోని మూడు అధికార కేంద్రాలకు ఆయన అధినాయకుడిగా కొనసాగనున్నారు. దీంతో ఇక, జిన్‌పింగ్‌ జీవితకాలం అధికారంలో కొనసాగుతారనే అభిప్రాయం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని