తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం

హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది.

Published : 29 Apr 2024 04:23 IST

తుపాన్లు, రుతుపవనాలపై ప్రభావం
శాస్త్రవేత్తల వెల్లడి

దిల్లీ: హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. దీనివల్ల ఈ ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు దాదాపు శాశ్వతంగా ఉంటాయని తెలిపింది. తుపాన్లు తీవ్రం కావొచ్చని, రుతుపవనాల తీరుతెన్నులపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ (ఐఐటీఎం)కి చెందిన రాక్సీ మాథ్యూ కాల్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. అందులో వెల్లడైన అంశాలివీ..

  • 1970 నుంచి 2000 సంవత్సరం మధ్యకాలంలో ఏటా 20 రోజుల పాటు హిందూ మహాసాగరంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండేవి. 21వ శతాబ్దం చివరినాటికి అది ఏటా 220 నుంచి 250 రోజులకు పెరగొచ్చు. దీనివల్ల హిందూ మహాసముద్రం దాదాపు నిరంతరం వేడిగా ఉంటుంది.
  • ఈ పరిస్థితి వల్ల పగడపు దిబ్బలు, సముద్ర గడ్డి దెబ్బతింటాయి. ఫలితంగా సముద్రజీవుల ఆవాసాలకు ఇబ్బందులు ఏర్పడతాయి. అంతిమంగా మత్స్య పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
  • హిందూ మహాసముద్రంలో పెను తాపం దాని ఉపరితల జలాలకే పరిమితం కాదు. 20వేల మీటర్ల లోతు వరకూ ఉష్ణోగ్రతలు విస్తరిస్తున్నాయి. అక్కడ దశాబ్దానికి 4.5 జెట్టా జౌల్స్‌ మేర వేడి పెరుగుతోంది. భవిష్యత్‌లో అది 16-22 జెట్టా జౌల్స్‌కు పెరగొచ్చు.
  • ఈ స్థాయిలో వేడి పెరుగుదల.. హిరోషిమా అణు బాంబును సెకనుకు ఒకటి చొప్పున దశాబ్దకాలం పాటు పేల్చడం వల్ల వెలువడేంత శక్తిని జోడించడంతో సమానం.
  • వాయవ్య హిందూ మహాసముద్ర ప్రాంతంలో గరిష్ఠంగా తాపం పెరుగుతుంది. సుమత్రా, జావా తీరాలకు చేరువలో ఈ పోకడ ఒకింత తక్కువగా ఉంటుంది.
  • హిందూ మహాసముద్రం వేడెక్కడం వల్ల ఉపరితల ఉష్ణోగ్రతల రుతుచక్రం మారుతుంది. దీనివల్ల ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అసాధారణ వాతావరణ పరిణామాలు పెరగొచ్చు.
  • 1980 నుంచి 2020 మధ్య హిందూ మహాసముద్రంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 26- 28 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉండేవి. 21వ శతాబ్దం చివరినాటికి అది 28.5- 30.7 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉండొచ్చు.
  • సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్‌ కన్నా ఎక్కువ ఉంటే తుపాన్లు ఏర్పడటానికి, బలపడటానికి అనువైన పరిస్థితులు ఉన్నట్లే. 1950ల నుంచి భారీ వర్షాలు, పెను తుపాన్లు పెరిగాయి. హిందూ మహాసాగరం వేడెక్కడం వల్ల భవిష్యత్‌లో అవి మరింత పెరగొచ్చు.
  • దీనివల్ల సముద్రమట్టం కూడా పెరగొచ్చు. రుతుపవనాలు, తుపాన్లపై ప్రభావం చూపే ‘ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌’లోనూ మార్పులు జరగొచ్చు. తీవ్రస్థాయి డైపోల్‌ పరిణామాలు 66 శాతం మేర పెరిగేందుకు వీలుంది. ఈ మహాసాగర జలాల్లో ఆమ్లత్వం కూడా పెరగొచ్చు.

మూడోవంతు జనాభాకు ఆవాసం..

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌ సహా 40 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో మూడోవంతు.. ఇక్కడే ఉంది. అందువల్ల ఈ మహాసాగర వాతావరణంలో జరిగే మార్పుల వల్ల సామాజిక, ఆర్థికపరంగా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రకృతి విపత్తుల ముప్పు ఎక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని