ఏప్రిల్‌లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!

గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం.

Published : 09 May 2024 06:53 IST

కొనసాగుతున్న పుడమి పెనుతాపం 

దిల్లీ: గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. గడిచిన నెల.. అత్యంత ఉష్ణమయ ఏప్రిల్‌గా నిలిచిపోయింది. ఆ నెలలో ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల తీవ్ర వేడి, వర్షాలు, వరదలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైందని పరిశోధకులు తెలిపారు.

బలహీనపడుతున్నప్పటికీ ఇంకా ఉనికిలో ఉన్న ఎల్‌నినో, మానవచర్యలతో తలెత్తిన వాతావరణ మార్పుల వల్ల ఇలా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐరోపా సంఘానికి చెందిన వాతావరణ సంస్థ.. కోపర్‌నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌ (సీ3ఎస్‌) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పుడమి సరాసరి ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. పారిశ్రామికీకరణకు ముందు కాలం (1850-1900)తో పోలిస్తే ఇది 1.58 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువ. 1991-2020 కాలంతో పోలిస్తే 0.67 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికం. ఏప్రిల్‌ నెలకు సంబంధించి మునుపటి రికార్డు ఉష్ణోగ్రత పెరుగుదల 0.14 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ‘‘ఈ ఏడాది ఆరంభంలో ఎల్‌నినో వాతావరణ పోకడ గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం అది తగ్గుముఖం పడుతోంది. తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులు తటస్థ స్థాయికి చేరుకుంటున్నాయి. ఎల్‌నినో వంటి సహజసిద్ధ ప్రక్రియలతో ముడిపడిన ఉష్ణోగ్రత వైరుధ్యాలు వస్తుంటాయి.. పోతుంటాయి. పెరుగుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువుల వల్ల మహాసముద్రాల్లో పేరుకుపోయిన అదనపు శక్తి.. ప్రపంచ ఉష్ణోగ్రతలను కొత్త రికార్డుల వైపు నెడుతోంది’’ అని సీ3ఎస్‌ కార్లోబువోన్‌టెంపో తెలిపారు.

1991-2020 నాటి సరాసరితో పోలిస్తే.. గత ఏడాది మే నెల నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్‌ వరకూ ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత 0.73 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎక్కువగా ఉంది. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే 1.61 డిగ్రీల సెల్సియస్‌ మేర ఇది అధికం.

ఈ ఏడాది జనవరితో ముగిసిన సంవత్సరకాలంలో భూతాపంలో పెరుగుదల.. తొలిసారిగా 1.5 డిగ్రీల సెల్సియస్‌ పరిమితిని దాటేసింది. అయితే ఇది స్వల్పకాలమే. దీర్ఘకాలంపాటు ఈ పోకడ కొనసాగితే పారిస్‌ ఒప్పందం కింద నిర్దేశించిన పరిమితిని శాశ్వతంగా అధిగమించినట్లవుతుంది.

పరీక్షా కాలంగా నిలిచిన ఏప్రిల్‌

ఫిలిప్పీన్స్‌, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్‌, భారత్‌లో ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలయ్యాయి. యూఏఈలో గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షపాతం నమోదైంది కూడా ఏప్రిల్‌ నెలలోనే. సముద్ర జలాలు అత్యంత వేడెక్కిన నెలగానూ ఈ ఏడాది ఏప్రిల్‌ నిలిచింది. భూతాపం ప్రభావంతో గత 13 నెలలుగా ప్రపంచంలోని సముద్రాల జలాలు వేడెక్కుతున్నాయని సీ3ఎస్‌ నివేదిక తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని