Prince Harry: విలియంకు నేనొక ‘స్పేర్‌’ పార్ట్‌.. ఆత్మకథలో హ్యారీ సంచలన వ్యాఖ్య..!

ప్రిన్స్‌ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర సంచలనంగా మారింది. చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న అవమానాలను అందులో పొందుపరిచారు. 

Updated : 12 Jan 2023 09:20 IST

వాషింగ్టన్‌: బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో ప్రిన్స్ హ్యారీ(Prince Harry) ‘స్పేర్’ పేరిట స్వీయ జీవిత చరిత్రను రాశారు. ఇందులో ఆయన వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ పుస్తకం బ్రిటన్‌లో రికార్డు అమ్మకాలు నమోదుచేస్తోంది. ఈ సందర్భంగా హ్యారీ చిన్నతనం, తన సోదరుడితో ఉన్న బంధం గురించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. 

‘విల్లీ(Prince William ) నా కంటే రెండేళ్లు పెద్దవాడు. విల్లీ సింహాసనానికి వారసుడు. నేను స్పేర్‌(అదనం). నేను అతడి నీడను. ప్లాన్‌ ఏ పనిచేయనప్పుడు నన్ను ప్లాన్‌ బిగా వాడతారు. విల్లీకి ఏదైనా జరగరానిది జరిగితే  అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చారు’ అని వెల్లడించారు. 

‘నా తండ్రి కింగ్ చార్లెస్‌-3, నా సోదరుడు విలియం ఎన్నడూ ఒకే విమానంలో ప్రయాణించరు. దాంతో సింహాసనం అధిష్టించేందుకు తర్వాత వరుసలో ఉన్న వారికి ఎలాంటి అనూహ్య ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు. నా విషయంలో ఎప్పుడూ అలాంటి జాగ్రత్త ఉండదు. నన్నెప్పుడు అదనం(Spare)గానే భావించడం వల్ల పెద్దగా ప్రాధన్యం ఉండేది కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.  ‘‘నేను 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నా తండ్రి చెప్పిన మాటల గురించి ఎవరో అంటుంటే విన్నాను. అవి నేను పుట్టినప్పుడు అమ్మతో నాన్న చెప్పిన మాటలు. ‘అద్భుతం.. నువ్వు నాకు వారసుడు(Heir), స్పేర్‌(Spare)ని ఇచ్చావు. నేను నా పని పూర్తి చేశాను’ అని ఆ మాటల సారాంశం’’ అని హ్యారీ రాసుకొచ్చారు. 

‘స్పేర్ (Spare)’ పేరుతో ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry) రాసిన ఆత్మకథలో రాజకుటుంబం (Royal Family)లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను బయటపెట్టారు. తన తండ్రి కింగ్‌ ఛార్లెస్‌, సవతి తల్లి కెమిల్లా, అన్నయ్య ప్రిన్స్‌ విలియం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన భార్య మేఘన్‌ మెర్కెల్‌ను రాజకుటుంబం వేదనకు గురిచేసిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని