Operation Kaveri: సూడాన్‌ నుంచి భారతీయుల తరలింపు షురూ!

ఘర్షణలతో అట్టుడుకున్న సూడాన్‌ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ మొదలైంది. ‘ఆపరేషన్‌ కావేరి’ పేరిట వారిని స్వదేశానికి తరలించనున్నట్లు భారత విదేశాంగ మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు.

Published : 24 Apr 2023 23:13 IST

ఖార్తూమ్‌: ఘర్షణలతో కల్లోలంగా మారిన సూడాన్‌ (Sudan)నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ మొదలైంది. దీనికోసం ‘ఆపరేషన్‌ కావేరి (Operation Kaveri)’ పేరిట భారత ప్రభుత్వం ప్రత్యేక మిషన్‌ ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే 500 మంది భారతీయులు సూడాన్‌ నౌకాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపారు. వారికి సంబంధించిన ఫొటోలు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మరికొందరు త్వరలోనే ఇక్కడికి చేరుకోనున్నట్లు చెప్పారు.

పౌరుల తరలింపునకు భారత వాయుసేన (Indian Air Force)కు చెందిన రెండు విమానాలను జెడ్డా (సౌదీ అరేబియా)లో నిలిపి ఉంచడంతోపాటు సూడాన్‌ తీరంలో ఐఎన్‌ఎస్‌ సుమేధ (INS Sumedha)ను అందుబాటులో ఉంచినట్లు కేంద్రం ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరికీ సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి జైశంకర్‌ వెల్లడించారు.

‘సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. సూడాన్ అధికారులు, ఐరాసతోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, అమెరికా తదితర దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. పౌరుల తరలింపునకు వివిధ అవకాశాలు పరిశీలిస్తున్నాం. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా తరలింపు ప్రణాళికలు అమలు చేస్తాం’ అని విదేశాంగ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు తాజాగా తరలింపు ప్రక్రియ ప్రారంభించింది.

ఇదిలా ఉండగా.. సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన.. ఆర్మీ- పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 400 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు.. ఆయా దేశాలు దౌత్య సిబ్బంది, పౌరుల తరలింపు ప్రక్రియ మొదలుపెట్టాయి. సూడాన్‌ నుంచి తమ దౌత్య సిబ్బందిని స్వదేశానికి తరలించినట్లు అమెరికా ప్రకటించింది. భారత్‌ సహా 28 దేశాలకు చెందిన 388 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు దిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని