Jaishankar: దేశ ప్రయోజనాల కోసమే ఇంధనం కొనుగోలు:జైశంకర్‌

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యాలో పర్యటిస్తోన్న భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌.. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపైనా చర్చిస్తామని ఇరువురు నేతలు పేర్కొన్నారు.

Published : 08 Nov 2022 18:52 IST

మాస్కో: ఉక్రెయిన్‌లో సంక్షోభం (Ukraine Crisis) ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోన్న వేళ.. ఆ దేశంతో తిరిగి చర్చలు ప్రారంభించాలని రష్యాకు భారత్‌ మరోసారి సూచించింది. గత కొన్నేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో తీవ్ర సంక్షోభాలను చవిచూసిన ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్‌ యుద్ధం పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యాలో పర్యటిస్తోన్న భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌(Jaishankar).. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపైనా చర్చిస్తామని ఇరువురు నేతలు పేర్కొన్నారు.

‘కొవిడ్‌ మహమ్మారి, ఆర్థిక ఒత్తిడులు, వాణిజ్య ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి కారణమయ్యాయి. వీటికితోడు ఉక్రెయిన్‌ యుద్ధం పర్యవసానాలను ప్రధానంగా చూస్తున్నాం. దేశాల ప్రగతికి అడ్డుపడే ఉగ్రవాదం, వాతావరణ సమస్యలు వంటి శాశ్వత సవాళ్లు ఉండనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మదింపు చేయడంతోపాటు అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించేందుకు సమావేశమయ్యాం. ఇరుదేశాలు ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడంలో ఇదో కీలక పరిణామం. సుదీర్ఘకాలంగా, స్థిరమైన బంధాన్ని కలిగి ఉన్న భారత్‌-రష్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు సహాయపడుతున్నాయి’ అని మాస్కో సమావేశంలో జైశంకర్‌ పేర్కొన్నారు. ఇక రష్యా నుంచి ఇంధనం కొనుగోలుపై స్పందించిన ఆయన.. తక్కువ ఆదాయ వనరులున్న భారత్‌ చౌక ధరలో లభ్యమయ్యే వనరులవైపు చూడక తప్పదన్నారు. ఈ క్రమంలో భారత్‌-రష్యాల బంధం తమకెంతో దోహదపడుతుందని.. దీన్ని మున్ముందు కొనసాగిస్తామని భారత విదేశాంగశాఖ మంత్రి స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మాస్కో నుంచి భారత్‌ ఇంధనం కొనుగోలును ముమ్మరం చేసింది. మరోవైపు, ఇది యుద్ధాలు చేసే శకం కాదని.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్‌ రష్యాకు సూచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని