హెజ్‌బొల్లాకు బ్రిటన్‌లో భారతీయుడి సాయం.. అమెరికాకు అప్పగించేందుకు సమ్మతి

లెబనాన్‌కు చెందిన మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లా(Hezbollah)కు నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వ్యక్తిని అమెరికాకు అప్పగించేందుకు(US extradition) బ్రిటన్‌ అంగీకరించినట్లు సమాచారం. 

Updated : 23 Nov 2023 13:03 IST

లండన్‌: బ్రిటన్‌(Britain)లో నివసిస్తున్న భారతీయ అకౌంటెంట్‌ను అమెరికాకు అప్పగించేందుకు(US extradition) రంగం సిద్ధమైంది. లెబనాన్‌ మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లాకు అతడు నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఆరోపణల కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడిని అమెరికాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులోని మధురైలో జన్మించిన 66 ఏళ్ల సుందర్‌ నాగరాజన్‌.. 2016 నుంచి యూకేలో నివసిస్తున్నారు. అతడు రిటైర్డ్ అకౌంటెంట్‌. హెజ్‌బొల్లా(Hezbollah)కు ఆర్థిక వనరులు సమకూరుస్తున్న నజీమ్ అహ్మద్‌కు సాయంగా నాగరాజన్‌ భారీ ఎత్తున మనీలాండరింగ్‌, ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడ్డారని అమెరికా ఆరోపించింది. నజీమ్‌కు బెల్జియం, లెబనాన్‌ దేశాల ద్వంద్వ పౌరసత్వం కూడా ఉంది. హెజ్‌బొల్లాకు సహకరిస్తున్నాడంటూ 2019లో అమెరికా అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అలాగే అతడు అమెరికా పౌరులతో లావాదేవీలు నిర్వహించకుండా నిషేధించింది. 

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్య ‘కుట్ర’ భగ్నం.. భారత్‌కు వెల్లడించిన అమెరికా..!

నజీమ్‌కు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడంలో నాగరాజన్ సాయం చేశాడని యూఎస్ ఆరోపించింది. ఈ క్రమంలో ఏప్రిల్‌లో నాగరాజన్‌ను బ్రిటన్‌లోని ఇంటి వద్ద అరెస్టు చేశారు. తనది హిందూ నేపథ్యమని, ఇస్లామిక్ ఉగ్రవాదానికి తాను మద్దతు ఇవ్వడం లేదని కోర్టులో అతడు వాదించాడు. కానీ, కోర్టు అతడి వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే అమెరికాకు అప్పగించేందుకు న్యాయస్థానం అనుమతించింది.

తాజాగా ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం వేళ..హెజ్‌బొల్లా పేరు వినిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా ఇరాన్‌తో హెజ్‌బొల్లా అంటకాగుతోంది. నిధుల దగ్గరి నుంచి ఆయుధాల వరకూ ఇరానే దీనికి సరఫరా చేస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోన్న వేళ హెజ్‌బొల్లా కూడా యుద్ధంలో భాగమైంది. కానీ, ఆ మిలిటెంట్‌ సంస్థ ప్రస్తుతం స్వల్పదాడులు, బెదిరింపులకే పరిమితమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు