Donald Trump: ఆస్కార్‌ వేదికపై పరువు పోగొట్టుకొన్న ట్రంప్‌..!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ నోటి దురుసు సంగతి తెలిసిందే. ఈ సారి ఆయన ఆస్కార్‌ వ్యాఖ్యాతను విమర్శించారు. కానీ, సదరు వ్యాఖ్యాత ట్రంప్‌ పరువు తీశాడు.   

Updated : 11 Mar 2024 12:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్కార్‌ అవార్డుల (Oscars 2024) వేదికపై డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) నవ్వుల పాలయ్యారు. ఈ వేడుకల వ్యాఖ్యాతను ఉద్దేశించి ఆయన పోస్టు చేసిన గంటలోనే ప్రతిస్పందన వచ్చింది. అవార్డుల ప్రదానోత్సవంపై ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. దీనిలో వ్యాఖ్యాత జిమ్మీను విమర్శించారు. ఈ విషయం వేడుకలు జరుగుతుండగానే అతడి దృష్టికి వచ్చింది.  

ఇక ఉత్తమ సినిమా అవార్డు ప్రకటించే సమయంలో జిమ్మీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇప్పుడే తన పనితీరుపై ఓ సమీక్ష అందిందని పేర్కొన్నాడు.  ట్రంప్‌ పేరు చెప్పకుండా సోషల్‌ మీడియా పోస్టును చదువుతూ.. ‘‘ఆస్కార్‌ వేడుకల్లో జిమ్మీని మించిన చెత్త హోస్ట్‌ ఎవరూ లేరు. సాధారణ స్థాయి కంటే తక్కువ వ్యక్తి తనకు సాధ్యంకాని దాన్ని ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అది ఎప్పటికీ జరగదు. ముందు అతడిని తొలగించి ఎవరైన చౌకబారు వ్యక్తితో భర్తీ చేయండి. అతడు కూడా వేదికను బలంగా చేయగలడు... బ్లా..బ్లా..బ్లా.. అని’’ రాసుకొచ్చారని పేర్కొన్నాడు. 

నగ్నంగా ఆస్కార్‌ వేదికపైకి.. అతిథులకు షాకిచ్చిన రెజ్లర్‌ జాన్‌సీనా

ఇక దీనికి సమాధానంగా కిమ్మెల్‌ స్పందిస్తూ.. మీరు ఆ పోస్టును ఏ మాజీ అధ్యక్షుడు ట్రూత్‌ సోషల్లో రాసి ఉంటారో ఊహించగలరని అతిథులతో అన్నాడు. ఇక ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ‘‘మీ జైలు గడువు ఇంకా ముగియలేదా..?’’ అని వెటకారంగా ప్రశ్నించాడు. ఈ మాటకు అక్కడున్న ప్రేక్షకులు గొల్లున నవ్వారు.  

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే నాలుగు క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన విచారణలు కూడా వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు ట్రంప్‌ 2024 ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని