Oscars 2024: నగ్నంగా ఆస్కార్‌ వేదికపైకి.. అతిథులకు షాకిచ్చిన రెజ్లర్‌ జాన్‌సీనా

ఆస్కార్‌ వేదికపైకి ఓ సూపర్‌ స్టార్‌ దిగంబరంగా వచ్చాడు. దాదాపు 50 ఏళ్లనాడు జరిగిన ఓ ఘటనకు గుర్తుగా నేటి వేడుకల్లో ఈ ఎపిసోడ్‌ చోటు చేసుకొంది. 

Updated : 11 Mar 2024 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఒక హైలైట్‌ ఉంటుంది.. ఈ సారి (Oscars 2024) ఉత్తమ కాస్ట్యూమ్‌ అవార్డు ఆ కీర్తిని దక్కించుకొంది. ఓ సూపర్‌ స్టార్‌ నగ్నంగా వేదికపైకి వచ్చి దీని విజేతలను ప్రకటించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ హాలీవుడ్‌ హీరో ఎవరోకాదు.. రెజ్లర్‌ జాన్‌ సీనా(John Cena)..!  ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 

1974లో జరిగిన ఆస్కార్‌ వేడుకలో ఒక పురుషుడు నగ్నంగా వేదికపైకి హఠాత్తుగా పరిగెత్తుకొచ్చాడు.. అప్పట్లో అది సంచలనంగా మారింది. కానీ, 50 ఏళ్ల తర్వాత 2024కు వచ్చే సరికి అనౌన్సరే నగ్నంగా వేదికపైకి వచ్చాడు. నేటి ఆస్కార్‌ వేడుకలకు జిమ్మీ కిమ్మెల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆయన మాట్లాడుతూ 1974 ఘటనను వివరిస్తూ.. ‘‘నాడు డేవిడ్‌ నివ్విన్‌ వేదికపైకి ఎలిజిబెత్‌ టేలర్‌ను ఆహ్వానిస్తుండగా.. ఓ పురుషుడు దిగంబరంగా వేదికపై పరిగెత్తాడు. ఈ రోజు ఎవరైనా న్యూడ్‌మెన్‌ వేదికపైకి వస్తే ఎలా ఉంటుందో ఊహించారా..? పిచ్చితనంగా అనిపించదా..?’’ అని ప్రశ్నించాడు. ఇంతలో వేదిక వెనక నుంచి జాన్‌ సీనా మాటలు వినిపించాయి. దీనికి స్పందించిన జిమ్మీ ‘‘అదే పనిలో ఉన్నాను’’ అంటూ సమాధానం ఇచ్చాడు. 

తనకు వేదికపైకి నగ్నంగా రావడం ఇష్టంలేదని చెప్పిన సీనా.. పురుషుడి శరీరం జోక్‌ కాదని వ్యాఖ్యానించాడు. కొద్దిసేపు అతడితో వాదించిన జిమ్మీ సరే అవార్డు ఇవ్వు అంటూ ఓ ఎన్వలప్‌ను అతడి చేతిలో పెట్టి వేదిక వెనక్కి వెళ్లిపోయాడు. 

ఇక దానిని అడ్డం పెట్టుకొని జాన్‌సీనా నగ్నంగానే వేదికపైకి వచ్చాడు. అతడిని చూసి అతిథులు పెద్దపెట్టున నవ్వుతూ చప్పట్లు కొట్టారు. మైకు ముందుకొచ్చి ఆ ఎన్వలప్‌ను తాను ఓపెన్‌ చేయలేనని చెప్పాడు. దీంతో సాయం చేసేందుకు జిమ్మీ అక్కడికి వచ్చి నామినేషన్లను ప్రకటించారు. వాటికి సంబంధించిన క్లిప్స్‌ ప్రదర్శిస్తున్న సమయంలో వేదికపై లైట్లు ఆర్పేశారు. కొందరు సహాయకులు వేగంగా అక్కడకు చేరుకొని జాన్‌సీనాకు దుస్తులు తొడిగారు. ఆ తర్వాత ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ అవార్డును ప్రకటించారు. ఇది ‘‘పూర్‌ థింగ్స్‌’’ చిత్రాన్ని వరించింది. దీనికి ఈ సారి బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, ఉత్తమ మేకప్‌ అవార్డులు కూడా వరించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని