Kim Jong Un: రష్యాలోకి ప్రవేశించిన కిమ్‌.. ఆయన రైలు చాలా ప్రత్యేకం..!

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ విలాసవంతమైన రైల్లో రష్యాలోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ధ్రువీకరించింది. కిమ్‌ రైలు కేవలం గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లడం గమనార్హం. 

Updated : 12 Sep 2023 10:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) భారీ సాయుధ రైల్లో దాదాపు 20 గంటలకు పైగా ప్రయాణించి రష్యాలోకి ప్రవేశించారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం ప్యాంగ్యాంగ్‌ నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన నేడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు ఓ వీడియోను రష్యా మీడియా సంస్థలు షేర్‌ చేశాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కోసం రష్యాకు భారీ స్థాయిలో శతఘ్ని గుండ్లు, ఇతర మందుగుండు సామగ్రి అవసరం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి కిమ్‌తో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.

మరోవైపు కిమ్‌తో పుతిన్‌ (Putin) భేటీపై క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ స్పందించారు. తాము అమెరికా హెచ్చరికలను పట్టించుకోమన్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఏకాకి కావడంతోనే రష్యా-ఉత్తరకొరియాలు జట్టు కట్టాయని అమెరికా విదేశాంగ శాఖ ఎద్దేవా చేసింది.

గంటకు 50 కిలోమీటర్ల వేగమే..

ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రయాణించిన రైలుకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కేవలం గంటకు 50 కిలో మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. ఎందుకంటే దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో ఆ బరువుకు వేగంగా వెళ్లలేదు.

ఈ రైలుపేరు తయాంఘో.. అంటే కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌కు గుర్తుగా ఈ పేరుపెట్టారు. ఆయన కాలం నుంచే ఉ.కొరియా నేతలు సుదూర ప్రయాణాలను రైల్లోనే చేయడం మొదలుపెట్టారు. ఆయన వియత్నాం, తూర్పు ఐరోపా ఖండంలో రైలు యాత్రలు చేశారు. 

ఈ రైలుకు భారీగా సాయుధ దళాల రక్షణ ఉంటుంది. వీరు ముందు స్టేషన్లు, మార్గాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. ఇక కిమ్‌ తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌కు విమానాలంటే భయం. అందుకే ఆయన పూర్తిగా రైలుపైనే ఆధారపడ్డారు. 2001లో ఆయన మాస్కో వెళ్లి చర్చలు జరపడానికి 10 రోజులపాటు రైల్లో ప్రయాణించారు. ప్రస్తుత నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మాత్రం అవసరమైతే విమానాల్లో కూడా ప్రయాణిస్తారు.

చైనా బెల్ట్‌కు చెక్‌!

ఉ.కొరియా నేతల ప్రైవేటు రైల్లో విలాసాలకు లోటులేదు. ఇందులో రష్యన్‌, చైనీస్‌, కొరియన్‌, జపనీస్‌, ఫ్రెంచి వంటకాలను సిద్ధంగా ఉంచుతారు. ఈ విషయాన్ని 2001లో కిమ్‌ జోంగ్‌ ఇల్‌తో ప్రయాణించిన రష్యన్‌ కమాండర్‌ వెల్లడించారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రెడ్‌ వైన్లు కూడా దీనిలో అందుబాటులో ఉంటాయి. పుతిన్‌ ప్రైవేటు రైల్లో కూడా ఇన్ని సౌకర్యాలుండవు. ఉ.కొరియా పాలకుల రైల్లో దాదాపు 90 కోచ్‌లు ఉంటాయి. కాన్ఫరెన్స్‌ రూమ్‌, ఆడియన్స్‌ ఛాంబర్‌, బెడ్‌రూమ్స్‌, శాటిలైట్‌ ఫోన్స్‌, ఫ్లాట్‌ స్క్రీన్‌ టెలివిజన్లు ఉంటాయని దక్షిణ కొరియా పత్రిక 2009లో కథనం వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని