Ebola: మళ్లీ పడగ విప్పుతోన్న ఎబోలా..!

ఆఫ్రికా ఖండంలో డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో(డీఆర్‌సీ)లో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. ఆ దేశంలోని ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్‌ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా

Updated : 02 May 2022 11:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆఫ్రికా ఖండంలో డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో(డీఆర్‌సీ)లో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. ఆ దేశంలోని ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్‌ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైనట్లు పేర్కొంది. ఈ ప్రావిన్స్‌లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. 

ప్రస్తుత పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మత్సడిషో మోతీ మాట్లాడుతూ  ‘‘ రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి  ప్రారంభమైంది. ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. ఈ వ్యాధిని అదుపుచేయడంలో డీఆర్‌సీకి ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది’’ అని పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఏప్రిల్‌ 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్‌ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు.  కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 

ప్రస్తుతం వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. త్వరలో వ్యాక్సినేషన్‌ను మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మబండకా పట్టణంలో 2020లోనే చాలా మంది ఎబోలా టీకాలు తీసుకొన్నారు. దీంతో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని