Nepal Plane Crash: నేపాల్‌ విమాన ప్రమాదం.. ప్రయాణికులంతా మృతి..!

నేపాల్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో లేరని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమాన శకలాలను గుర్తించిన అధికారులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు

Updated : 30 May 2022 13:03 IST

ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం

కాఠ్‌మాండూ: నేపాల్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులెవరూ ప్రాణాలతో లేరని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమాన శకలాలను గుర్తించిన అధికారులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విమానంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.

తారా ఎయిర్‌ సంస్థకు చెందిన చిన్న విమానం ఒకటి నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. పొఖారా నుంచి జోమ్‌సోమ్‌ పర్యాటక ప్రాంతానికి బయల్దేరిన ఈ విమానం మార్గమధ్యంలో ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌తో సంబంధాలు కోల్పోయింది. మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. ముస్తాంగ్‌ జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో కుప్పకూలింది. ఘటన సమయంలో విమానంలో 22 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు భారత్‌లోని మహారాష్ట్రకు చెందినవారు.

కొండ భాగాన్ని ఢీకొనడంతో విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు వెల్లడించారు. విమానానికి సంబంధించిన శకలాలను ముస్తాంగ్‌లోని థసంగ్‌ పర్వత ప్రాంతాల్లో గుర్తించినట్లు నేపాల్‌ ఆర్మీ వెల్లడించింది. దీంతో వెనువెంటనే ఆ ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ నారాయణ్‌ సిల్వాల్‌ తెలిపారు.

ఇప్పటివరకు 14 మృతదేహాలను ఘటనాస్థలంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల పరిధిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు పేర్కొన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ఈ విమానంలో ప్రయాణికులెవరూ బతికే అవకాశం లేదని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని