Khan Younis: ఇజ్రాయెల్‌ సేనల ఉపసంహరణ.. ఆ నగరంలో ‘మనుగడ కష్టమే’!

అపార్టుమెంట్లు, భారీ భవంతులు, వాణిజ్య సముదాయాలతో కళకళలాడిన ఖాన్‌ యూసిస్‌ నగరం.. ఇజ్రాయెల్‌ సేనల దాడితో నామరూపాల్లేకుండా పోయింది.

Published : 08 Apr 2024 20:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ గాజాలో ఖాన్‌ యూనిస్‌ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (Israel Hamas Conflict) వెల్లడించాయి. దీంతో కొన్ని నెలలుగా తమ నివాసాలకు దూరంగా తలదాచుకున్న వేల కుటుంబాలు సొంత గూటికి తిరుగు పయనమయ్యాయి. చివరకు వచ్చి చూస్తే అక్కడంతా విధ్వంసమే. స్కూళ్లు, ఆసుపత్రులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు అపార్టుమెంట్లు, భారీ భవంతులు, వాణిజ్య సముదాయాలతో కళకళలాడిన ఖాన్‌ యూసిస్‌ నగరం (Khan Younis).. ఇజ్రాయెల్‌ సేనల దాడితో నామరూపాల్లేకుండా పోయింది.

ఖాన్‌ యూనిస్‌ జనాభా 14 లక్షలు. గాజాలో సగం జనాభా ఇక్కడే ఉంది. గత అక్టోబర్‌ 7న గాజాపై యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్‌.. డిసెంబర్‌లో ఖాన్‌ యూనిస్‌ నగరంపైకి సేనలను పంపించింది. హమాస్‌ ఉగ్రవాదులకు కీలక స్థావరంగా ఉన్న ఈ నగరాన్ని జల్లెడ పట్టింది. బందీలుగా చేసుకున్న వారిని ఈ నగరంలోనే దాచిపెట్టినట్లు భావించిన ఇజ్రాయెల్‌ సైన్యం.. ఉగ్రవాదులు తల దాచుకున్నట్లు అనుమానించిన టన్నెళ్లను ధ్వంసం చేసింది. ఈక్రమంలో అక్కడి ప్రధాన ఆసుపత్రి పైనా దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో వేల మంది హమాస్‌ ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. అయితే, దాడుల నేపథ్యంలో లక్షల మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

సస్పెండైనా మారని మాల్దీవుల నేత.. మన జాతీయ జెండాను అగౌరవించి..

నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించిన వెంటనే.. సైకిళ్లు, నడక మార్గంలో వేల మంది ఇంటిబాట పట్టారు. గుట్టలుగా పడిన శిథిలాలను దాటుకుంటూ వచ్చిన నగరవాసులకు నిరాశే మిగులుతోంది. ఎక్కడ చూసినా శిథిలాలే. సొంతింటినీ గుర్తు పట్టలేకుండా పోయిన పరిస్థితి. యుద్ధంలో మిగిలిపోయిన ప్రమాదకర బాంబులు దర్శనమిస్తున్నాయి. ‘నగరంలో అధిక భాగం శిథిలంగా మారింది. ఏ ప్రాంతాన్నీ వదిలిపెట్టలేదు. ఇక్కడ మనుగడకు అవకాశమే లేకుండా పోయింది’ అని ఖాన్‌ యూనిస్‌ వాసులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని