UPI: ఇక ఫ్రాన్స్‌లోనూ యూపీఐ చెల్లింపుల వ్యవస్థ: ప్రధాని మోదీ

ఫ్రాన్స్‌లోనూ త్వరలో యూపీఐ సేవలు ప్రారంభం అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్యారిస్‌లో భారత పౌరులతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు.   

Updated : 14 Jul 2023 01:13 IST

ప్యారిస్‌: భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న నగదు చెల్లింపుల వ్యవస్థ ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’(UPI) సేవలు ఇక ఫ్రాన్స్‌లోనూ ప్రారంభం కానున్నాయి. ప్యారిస్‌లో భారత పౌరులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆహ్వానం మేరకు ఆ దేశ నేషనల్‌ డే వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్యారిస్‌లో భారత ప్రవాసులతో మోడీ భేటీ అయ్యారు. ‘‘ ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపుల సేవలను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. త్వరలోనే ఈఫిల్‌ టవర్‌ వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతాన్ని చూడడానికి వచ్చే భారత పర్యాటకులు భారత కరెన్సీ అయిన రూపాయిని ఇక్కడ చెల్లింపుల కోసం వాడవచ్చు’’ అని ప్రధాని పేర్కొన్నారు. 

ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలు అమలు అయితే భారత పర్యాటకులకు పెద్ద ఎత్తున ఉపయుక్తం కానుంది. 2016 ఏప్రిల్‌లో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NCPI) 21 బ్యాంకులతో కలిసి ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీంతో భారత్‌లో ఈ సేవలు విశేషంగా ప్రాధాన్యం పొందాయి. యూఏఈ, భూటాన్‌, నేపాల్‌లో వంటి దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూరప్‌, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఎన్‌పీసీఐ చర్చలు జరుపుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని