China-India: ప్రధాని మోదీ ‘అరుణాచల్‌’ పర్యటనపై చైనా అక్కసు!

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించడంపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది.

Published : 11 Mar 2024 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా (China) తన అక్కసు వెళ్లగక్కింది. ఈవిషయమై భారత్‌తో దౌత్యపరంగా తమ నిరసనను తెలియజేసినట్లు సోమవారం వెల్లడించింది. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పేర్కొనడం గమనార్హం. అరుణాచల్‌ను చైనా ‘జాంగ్‌నన్‌ (దక్షిణ టిబెట్‌)’గా పేర్కొంటోంది.

‘‘జాంగ్‌నన్‌ ప్రాంతం చైనాలో భాగం. చట్టవిరుద్ధంగా ఏర్పాటుచేసిన అరుణాచల్‌ను మేం ఎన్నడూ గుర్తించలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇరుదేశాల సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. జాంగ్‌నన్‌ను అభివృద్ధి చేసే హక్కు ఆ దేశానికి లేదు. ఇటువంటి చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత జటిలం చేస్తాయి. చైనా- భారత్‌ సరిహద్దులోని తూర్పు ప్రాంతంలో ఆ దేశ ప్రభుత్వాధినేత పర్యటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. ఈవిషయమై మా నిరసనను తెలియజేశాం’’ అని వెన్‌బిన్‌ తెలిపారు.

చైనా జడి‘సేలా సొరంగం’

చైనా- భారత్‌ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మన నేతలు పర్యటించినప్పుడల్లా డ్రాగన్‌ అభ్యంతరం తెలుపుతోంది. అయితే.. ఈ రాష్ట్రం తమ అంతర్భాగమని భారత్‌ పలుమార్లు తేల్చి చెప్పింది. గతేడాది ఇక్కడి 11 ప్రాంతాలకు బీజింగ్‌ కొత్త పేర్లు పెట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని