చైనా జడిసేలా సొరంగం

భారత్‌-చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేశారు.

Updated : 10 Mar 2024 04:10 IST

13 వేల అడుగుల ఎత్తున నిర్మాణం
డ్రాగన్‌ దేశం సరిహద్దుకు సేనల తరలింపు సులభం

ఈటానగర్‌, దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేశారు. సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల ఎత్తున చేపట్టిన ఈ నిర్మాణం.. ప్రపంచంలోనే (ఆ ఎత్తులో) పొడవైన జంట మార్గాల సొరంగంగా నిలవనుంది. అస్సాంలోని తేజ్‌పుర్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లోని కమెంగ్‌ జిల్లాతో కలిపేలా రూ.825 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మంచు, కొండ చరియలు విరిగి పడడం వల్ల రాకపోకలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులను ఈ మార్గంతో అధిగమించవచ్చు. అనేక సవాళ్లను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) ఈ సొరంగాన్ని కేవలం అయిదేళ్ల వ్యవధిలో నిర్మించింది. 2019 ఫిబ్రవరి 9న మోదీ దీనికి శంకుస్థాపన చేశారు.


సేలా వంతెన నిర్మాణ విశేషాలు..

  • సొరంగం నిర్మించడానికి 90 లక్షల ‘పనిగంటలు’ పట్టింది. రోజుకు సగటున 650 మంది కూలీలు అయిదేళ్లపాటు పనిచేశారు.
  • 71వేల టన్నుల సిమెంటు, 5 వేల టన్నుల ఉక్కు దీనిలో వినియోగించారు. కొండలు పిండిచేయడానికి 800 టన్నుల పేలుడు పదార్థాలు వాడారు.
  • తవాంగ్‌-దిరాంగ్‌ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రోజుకు 3 వేల కార్లు, 2 వేల ట్రక్కులు తిరిగేందుకు సొరంగాలు సరిపోతాయి. ఎంత ఎత్తున్న సైనిక వాహనాలైనా దీనిలో వెళ్లవచ్చు.
  • మెరుగైన భద్రత కోసం గాలి-వెలుతురు వచ్చే వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరిగితే బయటపడేందుకు సమాంతర ఏర్పాట్లు ఉన్నాయి.
  • చైనా సరిహద్దులు ఎత్తైన ప్రదేశాల్లో ఉండటంతో డ్రాగన్‌ బలగాలు సులభంగా మన దళాల కదలికలను కనిపెట్టగలవు. సేలా సొరంగం అందుబాటులోకి రావడంతో వారికి ఆ అవకాశం మూసుకుపోయింది.

నిజానికి ఇవి జంట సొరంగాలు. మొదటిది (టన్నెల్‌-1) 1,003 మీటర్ల పొడవుతో ఒకే మార్గంగా ఉంటుంది. రెండోది రెండు సొరంగ మార్గాలతో 1,595 మీటర్ల పొడవున ఉంటుంది. రెండింటిని కలిపే అనుసంధాన రహదారి పొడవు 1,300 మీటర్లు. రెండో సొరంగంలో ఒక మార్గాన్ని సాధారణ ట్రాఫిక్‌కు, రెండోది అత్యవసర సేవలకు కేటాయించారు.

పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల భారీగా మంచు కురిసే కాలంలోనూ ఈ సొరంగం ద్వారా నిరాటంకంగా రాకపోకలకు వీలుంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని