Prince Harry: తండ్రి కోరిక మేరకే వస్తున్నా.. 10 వరుసల ఆవల ప్రిన్స్‌ హ్యారీ సీటింగ్‌..!

బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌-3(King Charles III)కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. దీనికి ప్రిన్స్‌ హ్యారీ(Prince Harry) కూడా హాజరవుతున్నారు. అయితే వేడుక వేళ ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవచ్చని తెలుస్తోంది.

Published : 25 Apr 2023 13:15 IST

లండన్‌: బ్రిటన్(Britain) రాజకుటుంబం గురించి ఇటీవల ప్రిన్స్‌ హ్యారీ(Prince Harry) వెల్లడించిన విషయాలు సంచలనాన్ని కలిగించాయి. అప్పటి నుంచి తన కుటుంబంతో సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌-3(King Charles III)కి వచ్చే నెల 6న పట్టాభిషేకం జరగనుంది. దీనికి ఆయన చిన్నకుమారుడు హ్యారీ హాజరవుతున్నారు. రాచరిక విధులను వదులుకొని అమెరికాలో స్థిరపడిన ఆయనకు ఈ వేడుకలో తగిన ప్రాధాన్యం దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆయన రాజకుటుంబానికి 10 వరుసల ఆవల కూర్చుంటారని సమాచారం.

తాజాగా యూకే ట్రిప్‌లో హ్యారీ(Prince Harry) తన కుటుంబంతో రాజీ పడే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘వారి మధ్య రాజీకి అవకాశాలు కనిపించడం లేదు. ఆయనకు విండ్సర్స్‌ నుంచి తగిన ఆదరణ లభించకపోవచ్చని నేను భావిస్తున్నాను. అయితే తన తండ్రి కోరిక మేరకు హ్యారీ ఆ వేడుకకు హాజరవుతున్నాడు’ అని తెలిపారు. ఈ పట్టాభిషేక కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. అయితే హ్యారీ.. పట్టాభిషేకం సమయంలో మాత్రమే అక్కడ ఉంటారని, కేవలం 24 గంటల్లో యూకే వచ్చి, తిరిగి వెళ్లిపోతారని సమాచారం. 

క్వీన్‌ ఎలిజబెత్‌ II మరణం తర్వాత.. కింగ్‌ ఛార్లెస్‌ (King Charles III) ఆ బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం (Coronation) మాత్రం మే 6న జరగనుంది. ఈ వేడుక కోసం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబే ముస్తాబవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని