Ukraine Crisis: ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక నగరం.. వేర్పాటువాదుల హస్తగతం!

ఉక్రెయిన్‌ తూర్పు డొనెట్స్క్‌ రీజియన్‌లోని వ్యూహాత్మక పట్టణం ‘లిమాన్‌’ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా మద్దతుగల వేర్పాటువాద దళాలు శుక్రవారం ప్రకటించాయి. మాస్కో బలగాలతో కలిసి లిమాన్‌ సహా 220 స్థావరాలను విముక్తి చేయడంతోపాటు...

Published : 28 May 2022 02:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌ తూర్పు డొనెట్స్క్‌ రీజియన్‌లోని వ్యూహాత్మక పట్టణం ‘లిమాన్‌’ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాద దళాలు శుక్రవారం ప్రకటించాయి. మాస్కో బలగాలతో కలిసి లిమాన్‌ సహా 220 స్థావరాలను విముక్తి చేయడంతోపాటు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు ఓలెక్సీ అరెస్టోవిచ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రష్యా సైన్యం తన దాడులను ముమ్మరం చేసిందన్న విషయాన్ని ఇది సూత్రప్రాయంగా నిరూపిస్తోందన్నారు.

డొనెట్స్క్ ప్రాంతానికి గవర్నర్‌గా వ్యవహరిస్తోన్న పావ్‌లో కిరిలెంకో సైతం ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. లిమాన్‌ పట్టణం ప్రస్తుతం రష్యా దళాల నియంత్రణలో ఉందని చెప్పారు. అయితే, ఉక్రెయిన్‌ సైన్యం కూడా ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల పట్టుసాధించినట్లు తెలిపారు. తూర్పు డొనెట్స్క్‌ ప్రాంతంలో ఉన్న ఈ పట్టణం.. ఉక్రెయిన్ ఆధీనంలోని క్రమాటోర్స్క్‌కు, సెవెరోడొనెట్స్క్‌కు మధ్యలో ఉంటుంది. కీవ్‌ నియంత్రణలో ఉన్న తూర్పు నగరాలకు ఇక్కడినుంచి దారి వెళ్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని కీలక ప్రాంతంగా భావిస్తారు. ఇది ప్రధాన రైల్వే హబ్‌ కూడా.

డాన్‌బాస్‌లో రష్యా బలగాల స్పష్టమైన పురోగతి: బోరిస్‌ జాన్సన్‌

రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో క్రమంగా స్పష్టమైన పురోగతి సాధిస్తున్నాయని బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. స్వయంగా పుతిన్‌తోపాటు రష్యా మిలిటరీకీ చాలా నష్టం వాటిల్లుతున్నా.. డాన్‌బాస్‌లో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు శుక్రవారం ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మల్టీపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌లతో సహా మరింత సైనిక సాయం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘ఈ సంక్షోభం ముగియాలంటే ఒకటే దారి. అదేంటంటే.. ఉక్రెయిన్‌లో డీ-నాజిఫికేషన్ పూర్తయ్యింది.. ఇక గౌరవప్రదంగా వెనక్కి వెళ్లొచ్చని పుతిన్ అంగీకరించడమే. దీనర్థం ఉక్రెయిన్‌లో నాజీలు ఉన్నారనే మాస్కో వాదనకు మద్దతు ఇచ్చినట్లు కాదు’ అని బోరిస్‌ వ్యాఖ్యానించారు. సైనిక చర్య ముగింపు విషయంలో పుతిన్‌కు రాజకీయ వ్యూహాలూ ఉన్నట్లు భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని