Rishi Sunak: సీట్‌బెల్ట్ వివాదం.. క్షమాపణలు చెప్పిన రిషి సునాక్‌

 బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) విపక్షాల నుంచి వరుస విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈసారి సీట్‌బెల్ట్ ఇందుకు కారణమైంది. 

Published : 20 Jan 2023 11:10 IST

లండన్‌: బ్రిటన్‌(Britain) ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) క్షమాపణలు చెప్పారు. ఒక వీడియో చిత్రీకరణ కోసం ప్రయాణంలో ఉన్న ఆయన స్వల్ప సమయంపాటు సీట్‌ బెల్ట్(Seat Belt) తీశారు. ఇది విమర్శలకు తావివ్వడంతో డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. 

‘హడావుడిగా నిర్ణయం తీసుకోవడంలో జరిగిన పొరపాటు అది. ఒక చిన్న వీడియో క్లిప్‌ చిత్రీకరణ కోసం ప్రధాని తన సీట్‌ బెల్ట్‌ను తీశారు. అలాచేయడం తప్పని ఆయన అంగీకరించారు. దీనిపై ఆయన క్షమాపణలు తెలియజేశారు. ప్రతిఒక్కరూ తప్పక సీట్‌బెల్ట్‌ ధరించాలన్నది ఆయన ఉద్దేశం’ అని వెల్లడించారు.

యూకే నిబంధనల ప్రకారం.. కారు ప్రయాణికులు సీట్‌ బెల్ట్‌ ధరించకపోతే, అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. ఇక ఆ వ్యవహారం కోర్టు వరకు వెళితే ఆ మొత్తం 500 పౌండ్ల వరకు పెరుగుతుంది. వైద్యపరమైన సమస్యలుంటే మినహాయింపులు ఉంటాయి. 

దేశవ్యాప్తంగా 100 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ప్రక్రియలో భాగంగా సునాక్‌ ఆ వీడియో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై లేబర్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ సీట్‌ బెల్ట్‌కు ఆర్థిక వ్యవస్థకు ముడిపెట్టి మండిపడ్డారు. ‘రిషి సునాక్‌కు తన సీట్‌ బెల్ట్, డెబిట్‌ కార్డు, ఆర్థిక వ్యవస్థ,ఈ దేశాన్ని ఎలా నిర్వహించాలో తెలీదు. రోజురోజుకూ ఈ జాబితా పెరిగిపోతోంది’ అని విరుచుకుపడ్డారు. ఇటీవల లండన్‌ నుంచి లీడ్స్‌ నగరానికి ఆయన ప్రైవేటు జెట్‌ను వినియోగించడంపైనా విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై సునాక్ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రధాని సమయాన్ని సమర్థవంతంగా వినియోగించే క్రమంలో అందులో ప్రయాణించినట్లు వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని