Ukraine war: పేట్రియాట్‌ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు రష్యా యత్నం..!

అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు చేరిన పేట్రియాట్‌ క్షిపణులు విజయవంతంగా రష్యా క్షిపణులను అడ్డుకొన్నాయి. ఈ విషయాన్ని అమెరికా, ఉక్రెయిన్‌ అధికారులు ధ్రువీకరించారు. 

Published : 14 May 2023 02:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine) రక్షణ కోసం అమెరికా (USA) పంపించిన పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇటీవల రష్యా (Russia) తీవ్రంగా యత్నించింది. ఇందుకోసం హైపర్‌సానిక్‌ క్షిపణలను కూడా ప్రయోగించి విఫలయత్నం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన ఈ క్షిపణులను ఉక్రెయిన్‌ పేట్రియాట్‌ వ్యవస్థను వాడి కూల్చేసింది. ఈ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్‌ దళాల చేతికి అందిన కొద్ది రోజుల్లోనే విజయవంతంగా వినియోగించిందని వెల్లడించారు. 

కీవ్‌ బయట మోహరించిన పేట్రియాట్‌ వ్యవస్థ నుంచి వెలువడిన ఓ సంకేతాన్ని రష్యా దళాలు పసిగట్టి వీటిపై కింజల్‌ హైపర్‌సానిక్‌ క్షిపణులను గురిపెట్టాయని అమెరికా వర్గాలు వెల్లడించాయి. కానీ, పేట్రియాట్‌ వ్యవస్థకు సుదూర లక్ష్యాలను గుర్తించే రాడార్‌ ఉండటంతో ముప్పును ముందుగానే పసిగట్టింది. ఈ క్షిపణులను మైకలోవ్‌ ప్రాంతంలో పేట్రియాట్‌ ఇంటర్‌సెప్ట్‌ మిసైల్స్‌ అడ్డగించాయి. ఈ ఘటన మే 4న చోటు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ వెల్లడించారు. పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ బ్రిగేడియర్‌ జనరల్‌ పాట్రిక్‌ రైడర్‌.. ఇటీవల ఉక్రెయిన్‌ పేట్రియాట్‌ వాడి కింజల్‌ క్షిపణిని అడ్డుకొన్నట్లు తెలిపారు.

అమెరికా సరఫరా చేసిన పేట్రియాట్‌ క్షిపణులు గత నెల ఉక్రెయిన్‌కు చేరాయి. వీటితో ఇక తమ గగనతలం సురక్షితమని కీవ్‌ భావిస్తోంది. పేట్రియాట్‌ క్షిపణులు యుద్ధ విమానాలను, ప్రత్యర్థి మిసైళ్లను లక్ష్యంగా చేసుకోగలవు. ఇటీవల కాలంలో రష్యా విచక్షణారహితంగా క్షిపణుల వర్షం కురిపించి ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలను ధ్వంసం చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్తు, మంచి నీటి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంది. పేట్రియాట్ల రాకతో దాడులు ఆగే అవకాశం ఉందని భావిస్తోంది. అయితే ఇది యుద్ధగమనాన్ని నిర్దేశించే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు