France Airports: ఒకేసారి 6 ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు.. ఫ్రాన్స్‌లో కలకలం

France Airports: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం వేళ.. ఫ్రాన్స్‌లో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది.

Published : 18 Oct 2023 16:54 IST

పారిస్‌: ఫ్రాన్స్‌లో ఒకేసారి పలు విమానాశ్రయాలకు (France Airports) బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆయా ఎయిర్‌పోర్టులను ఖాళీ చేయించిన అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఈ బెదిరింపులు రావడం గమనార్హం.

ఫ్రాన్స్‌లో లిల్లె ఎయిర్‌పోర్టుకు తొలుత బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్‌ వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది విమానాశ్రయాన్ని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే బ్యూవైస్‌, టోలౌస్‌, నైస్‌, లియాన్‌, నాంటెస్‌ ఎయిర్‌పోర్టులకు కూడా ఈ తరహా బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఆ విమానాశ్రయాలను ఖాళీ చేయించారు. ఏం జరుగుతుందో అర్థం గాక.. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వారి రాకెట్‌ గురితప్పే పేలుడు.. అల్‌ అహ్లి ఆసుపత్రి ఘటనపై ఐడీఎఫ్‌ ప్రతినిధి..!

కాగా.. నైస్‌ ఎయిర్‌పోర్టులో ఓ అనుమానాస్పద బ్యాగు కూడా కన్పించినట్లు ఆ విమానాశ్రయం తమ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినట్లు పేర్కొంది. మరోవైపు, లిల్లె ఎయిర్‌పోర్టులోనూ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి.

కాగా.. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు (Israel Hamas Conflict) తర్వాత నుంచి ఫ్రాన్స్‌లో ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఓ స్కూల్‌లోకి దుండగుడు చొరబడి ఓ టీచర్‌ను అతి దారుణంగా పొడిచి చంపిన విషయం తెలిసిందే. దీంతో ఫ్రాన్స్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని