Israel: వారి రాకెట్‌ గురితప్పే పేలుడు.. అల్‌ అహ్లి ఆసుపత్రి ఘటనపై ఐడీఎఫ్‌ ప్రతినిధి..!

గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిపై దాడి తమ పని కాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ వెల్లడించింది. ఈ మేరకు సాక్ష్యాలను ట్విటర్‌లో అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో వీడియోలు, ఆడియో రికార్డింగ్‌లు వంటివి కూడా ఉన్నాయి.  

Updated : 18 Oct 2023 15:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజాలో ఆసుపత్రిపై దాడికి వాడిన మందుగుండు యుద్ధ విమానాలు ప్రయోగించేది వలే లేదని ఐడీఎఫ్‌ ప్రతినిధి వెల్లడించారు. గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిలో పేలుడుకు సంబంధించి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ పలు ఆధారాలను ట్వీట్‌ చేస్తోంది. తాజాగా ఐడీఎఫ్‌ ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వాస్తవానికి పేలుడు ఆసుపత్రి పార్కింగ్‌ ప్రదేశంలో చోటు చేసుకొందని వివరించారు. ‘‘పేలుడు చోటు చేసుకొన్న ప్రదేశంలో భారీ గొయ్యి ఏర్పడలేదు. అక్కడి గోడలు కూడా బలంగానే ఉన్నాయి. ఆ పార్కింగ్‌లో పేలుడుకి వాడింది గగనతల దాడులకు వినియోగించే మందుగుండు కాదని తెలుస్తోంది. మా ఏరియల్‌ పుటేజీ విశ్లేషణలో ఆసుపత్రిని ఏదీ నేరుగా తాకలేదని తేలింది. అక్కడి పార్కింగ్‌ ప్రదేశం దెబ్బతిన్నది. అక్కడ కాలిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసుపత్రికి అత్యంత సమీపం నుంచి రాకెట్‌ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ రాకెట్‌ కూలిపోవడంతో అందులోని ఇంధనం జాడ కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. 

‘‘రాత్రి 6.59 సమయంలో ఆసుపత్రి సమీపంలోని శ్మశానం నుంచి ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థ  దాదాపు 10 రాకెట్లను ప్రయోగించింది. గాజాలోని ఆసుపత్రిలో అదే సమయానికి పేలుడు వినిపించింది’’ అని డేనియల్‌ హగారి వెల్లడించారు. రాకెట్‌ గురితప్పడంపై చర్చించుకొంటున్న ఇద్దరు ఉగ్రవాదుల సంభాషణలు కూడా తమ ఇంటెలిజెన్స్‌ సేకరించిందన్నారు.  ఈ సందర్భంగా పేలుడు తర్వాత ఇద్దరు హమాస్‌ ఆపరేటీవ్‌ల సంభాషణలను, పేలుడు ప్రదేశం ఏరియల్‌ వ్యూ వీడియోను కూడా ఐడీఎఫ్‌ ట్వీటర్‌లో పోస్టు చేసింది. 

గాజాలోని మిలిటెంట్‌ సంస్థలు ప్రయోగించే రాకెట్లు మార్గం మధ్యలో కూలిపోవడం సర్వసాధారణమని హగారి వెల్లడించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 450 రాకెట్లు గాజా భూభాగంలోనే కూలిపోయాయని వివరించారు. పారదర్శకత కోసం తాము ఆధారాలను అమెరికా సహా ఇతరులతో పంచుకొంటున్నామని చెప్పారు. 

యుద్ధం వేళ.. ఇజ్రాయెల్‌లో అందుకే అడుగుపెట్టా! జో బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇజ్రాయెల్‌ పర్యటనకు బయల్దేరడానికి ముందు అల్‌ అహ్లి ఘటన చోటు చేసుకోంది. దీంతో జోర్డాన్‌, ఈజిప్ట్‌ నేతలతో జరగాల్సిన బైడెన్‌ భేటీ రద్దైంది. ఈ దాడికి ఇజ్రాయెల్‌ కారణమని జోర్డాన్‌, ఈజిప్ట్‌, సౌదీ అరేబియా తదితర దేశాలు ఆరోపించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని