Switzerland: గ్రామంపై కూలిపోనున్న కొండచరియ.. వందల ఏళ్ల జ్ఞాపకాలతో ఖాళీ చేస్తున్న ప్రజలు!

ఆల్ఫ్‌ పర్వతశ్రేణుల్లోని కొండచరియ కారణంగా ఓ గ్రామం పూర్తిగా కనుమరుగు కానుంది. ఎప్పుడు ఊడిపడుతుందో తెలియకపోవడంతో అధికారులు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Published : 13 May 2023 00:51 IST

జెనీవా: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వ యంత్రాగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. కొద్దిరోజులు తమ ప్రాంతాన్ని వీడి వెళ్లాలంటే అక్కడి ప్రజలు ఎంతో ఆవేదన చెందుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లి.. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తుంటారు. తాజాగా, ఓ కొండచరియ కారణంగా ఓ గ్రామం పూర్తిగా కనుమరుగు కానుంది. ఎప్పుడు ఊడిపడుతుందో తెలియకపోవడంతో అధికారులు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఎన్నో వందల ఏళ్లుగా అక్కడ జీవిస్తున్న వందల కుటుంబాలు ఆ ప్రాంతంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గ్రామాన్ని ఖాళీ చేస్తున్నాయి. కార్లు, ట్రక్‌లు, పికప్‌ ట్రక్‌ల సాయంతో చిన్నా, పెద్దా.. తమ పెంపుడు జంతువులతో సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోతున్నారు. 

తూర్పు స్విట్జర్లాండ్‌(Switzerland)లో బ్రియేంజ్‌ (Brienz) ప్రాంతంలోని ఆల్ఫ్‌ పర్వత శ్రేణుల్లో ఓ గ్రామంలో ప్రజలు ఎన్నో వందల ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గ్రామం దగ్గర్లో భూమిలో వింత శబ్దాలు రావడంతో భూగర్భ శాస్త్రవేత్తలు (Geologists) ఆ ప్రాంతాన్ని పరీక్షించారు. తర్వాత కొద్దిరోజులకు ఆల్ఫ్‌ పర్వతశ్రేణుల్లోని రెండు మిలియన్‌ క్యూబిక్‌ మీటర్‌ వ్యాసం కలిగిన ఓ కొండచరియ విరిగి గ్రామంపై పడబోతోందని గుర్తించారు. ‘‘కొండచరియలు చిన్న చిన్న రాళ్లుగా గ్రామంపై పడేందుకు 60 శాతం అవకాశం ఉంది. కానీ పెద్ద రాయిగా గ్రామంపై జారిపడేందుకు 10 శాతం అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం’’ అని క్రిస్టియన్‌ గ్రాట్‌మన్‌ అనే అధికారి తెలిపారు. ఈ గ్రామంలో జర్మన్‌, రోమన్‌ మూలాలు కలిగిన ప్రజలు నివస్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా హిమనీనదాలు కరిగిపోవడం వల్ల పర్వత శ్రేణుల్లోని భూగర్భ శిలజాలాలు కదిలిపోయి కొండచరియలు విరిగిపడిపోతున్నాయని గ్రాట్‌మన్‌ తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు