Sweden: ‘నాటో’ 32వ సభ్యదేశంగా స్వీడన్‌

‘నాటో (NATO)’లో 32వ సభ్యదేశంగా స్వీడన్‌ అధికారికంగా చేరింది.

Published : 07 Mar 2024 23:11 IST

వాషింగ్టన్‌: పశ్చిమ దేశాల సైనిక కూటమి ‘నాటో (NATO)’లో 32వ సభ్యదేశంగా స్వీడన్‌ (Sweden) అధికారికంగా చేరింది. స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు ఓ కార్యక్రమంలో ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. తద్వారా రెండో ప్రపంచ యుద్ధానంతరం దశాబ్దాల తరబడి కొనసాగించిన తటస్థ వైఖరికి స్వీడన్‌ వీడ్కోలు పలికినట్లయ్యింది.

2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి పరిణామాలతో ‘నాటో’లో చేరిక దిశగా స్వీడన్‌ ముందడుగు వేసింది. ఈ దేశం చేరికపై తుర్కియే, హంగరీలు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ‘నాటో’ సభ్యదేశంగా స్వీడన్ ఉండటం.. అమెరికా, దాని మిత్రపక్షాలను భద్రతాపరంగా మరింత సురక్షితం చేస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. నాటో విస్తరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న రష్యా.. ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. గతేడాది 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్‌ చేరికను తమ భద్రత, జాతీయ ప్రయోజనాల ఉల్లంఘనగా క్రెమ్లిన్ పేర్కొంది.

విస్తరిస్తోంది చూడు.. నాటో.. నాటో..

నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో) ఒక సైనిక కూటమి. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో నాటో రూపుదాల్చింది. కూటమిలోని సభ్య దేశాలపై ఇతర దేశాలు యుద్ధానికి దిగితే ఒకరికొకరు అండగా నిలవడంతోపాటు సైనిక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. ఒక దేశం నాటోలో చేరాలనుకుంటే.. ముందుగా కూటమిలోని అన్ని సభ్యత్వ దేశాలు దానికి అంగీకరించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని