India-Canada: కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది: భారత్‌పై ఆరోపణలకు అమెరికా నిపుణుల హెచ్చరిక

భారత్‌పై కెనడా (Canada) ప్రధాని ట్రూడో (Justin Trudeau) చేసిన తీవ్ర ఆరోపణలను అమెరికా విదేశాంగశాఖ నిపుణులు ఖండించారు. కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని, అందులో వాషింగ్టన్‌ జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు.

Published : 20 Sep 2023 10:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ (India) హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Canada PM Justin Trudeau) తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై పలు దేశాలు స్పందిస్తున్నాయి. అమెరికా (USA)లోని కొంతమంది నిపుణులు.. ట్రూడో తీరును తీవ్రంగా ఖండించారు. కెనడా చర్య ‘సిగ్గుచేటు’ అని దుయ్యబట్టారు. అటు ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్ట్రేలియా.. భారత్‌పై కెనడా ఆరోపణలు ఆందోళనకరమని పేర్కొంది.

భారత్‌-కెనడా (India-Canada) మధ్య చోటు చేసుకొన్న పరిణామాలపై వాషింగ్టన్‌లో హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ చర్చాకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ.. ‘‘ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారు. ఖలిస్థానీ నేత హత్యలోకి భారత్‌ను లాగుతూ అతడు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఇది రాజకీయంగా ట్రూడోకు దీర్ఘకాలంలో లాభం చేకూరుస్తుందేమో గానీ.. నాయకత్వ లక్షణం మాత్రం కాదు. ఈ వ్యవహారంలో అమెరికా నేతలు ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నాం. ఎందుకంటే కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది’’ అని ట్రూడో తీరుపై మండిపడ్డారు.

భారత్‌-కెనడా ఢీ అంటే ఢీ.. దౌత్యవేత్తలపై పరస్పరం బహిష్కరణాస్త్రాలు

ట్రూడో వ్యాఖ్యలు ఆందోళనకరం: ఆస్ట్రేలియా

‘‘భారత్‌పై కెనడా ఆరోపణలు ఆందోళనకరం. అయితే, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మా భాగస్వామ్య పక్షాలతో కలిసి తాజా పరిణామాలను మేం సునిశితంగా పరిశీలిస్తున్నాం. మా ఆందోళనలను భారత్‌తో కూడా పంచుకున్నాం. దీనిపై ఇంతకంటే మేం మాట్లాడలేం’’ అని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ విలేకరులతో అన్నారు.

అటు బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్‌ సింగ్‌ కూడా దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘కెనడా వ్యాఖ్యలు ఆందోళనకరం. దీనిపై యూకే ప్రభుత్వంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. న్యాయం జరగాలి’’ అని పేర్కొన్నారు.

ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేయగా, బదులుగా భారత్‌ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని