Imran khan: లాహోర్‌లో హైడ్రామా.. పాక్‌ సర్కార్‌పై ఇమ్రాన్‌ తీవ్ర ఆరోపణలు

లాహోర్‌లోని ఇమ్రాన్‌ ఖాన్‌ నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. అరెస్టు వారెంట్‌తో వచ్చిన పోలీసులు తాము ఖాళీ చేతులతో వెళ్లేది లేదని చెబుతుండగా.. ఆయన్ను అరెస్టు చేస్తే ఆందోళనల్ని ఉద్ధృతం చేస్తామంటూ పీటీఐ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.

Updated : 05 Mar 2023 19:19 IST

లాహోర్‌: పాకిస్థాన్‌(pakistan)మాజీ ప్రధాని, తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ఇంటి వద్ద హైడ్రామా నడుస్తోంది. లాహోర్‌లో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్‌ పోలీసులు జమాన్‌ పార్క్‌ రెసిడెన్సీకి రావడం.. దీంతో ముందుగానే పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ షెహబాజ్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశాధినేతలు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడకపోతే  దేశం బానిసగా మారుతుందన్నారు. అవినీతికి పాల్పడి అరెస్టు అవ్వాల్సిన నేతను ప్రధానిని చేయడం వల్లే తమ దేశ పతనానికి దారితీసిందని ఆరోపించారు.

అగ్ర నేతలే నేరస్థులైతే..

‘‘భారతదేశ ఛానళ్లను చూడండి.. పాకిస్థాన్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు విమర్శలకు గురవుతుందో తెలుసుకోండి. అవినీతికి పాల్పడి అరెస్టవుతున్న నేతను ప్రధానిని చేయడం వల్లే పాకిస్థాన్‌ దిగజారిపోయింది. మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా ఆయన్ను కాపాడి.. ప్రధానిని చేశారు. ఇంటీరియర్‌ మినిస్టర్‌ పైనా హత్యారోపణలు ఉన్నాయి. అసిఫ్‌ జర్దారీ ఓ హంతకుడు. ప్రభుత్వంలోని అగ్ర నేతలే నేరస్థులైతే.. ఇక దేశం ఏమవుతుంది? ఇలాంటి తప్పులకు వ్యతిరేకంగా నిలబడకపోతే దేశం బానిసగా మారుతుంది. పాకిస్థాన్‌ ఇప్పుడు బెగ్గర్‌లా మారింది. ప్రపంచవ్యాప్తంగా అవమానాలకు గురవుతోంది.  దేశానికి ఇదో గడ్డు కాలం. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. పాకిస్థాన్‌ చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు నలిగిపోతున్నారు. ప్రభుత్వాధి నేతలు తమ సంపదను విదేశాల్లో ఎంత దాచుకున్నారో ప్రపంచానికి తెలుసు. వజీరాబాద్‌లో నాపై జరిగిన హత్యాయత్నం వెనుక అధికారంలో ఉన్నవారంతా ఉన్నారు’’ అంటూ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఇంటీరియర్‌ మంత్రి రానా సనావుల్లా, ఇంటెలిజెన్స్‌ అధికారుల పేర్లను ఇమ్రాన్‌ ప్రముఖంగా ప్రస్తావించారు.

ఖాళీ చేతులతో వెళ్లేది లేదు.. పోలీసులు

ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన మూడు సార్లు విచారణకు పిలిచినా ఇమ్రాన్‌ హాజరుకాకపోవడంతో సెషన్సు కోర్టు ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. ఖాన్‌ను మార్చి 7వ తేదీ నాటికి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్‌ పోలీసులు లాహోర్‌లోని జమాన్‌ పార్క్‌ రెసిడెన్సీకి చేరుకున్నారు. అప్పటికే పీటీఐ నేత ఫవాద్‌ చౌధరి ఇచ్చిన పిలుపుతో వందలమంది పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్‌ నివాసం ఎదుట గుమిగూడారు.  అయతే, ఎవరైనా తమను అడ్డుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాము ఖాళీ చేతులతో వెళ్లేది లేదని ఇస్లామాబాద్ పోలీస్‌ చీఫ్‌ తేల్చి చెప్పారు. ఒకవేళ అరెస్టు చేస్తే మాత్రం నిరసనల్ని మరింత ఉద్ధృతం చేస్తామని పార్టీ శ్రేణులు చెప్పాయి.  ఈ నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇమ్రాన్‌ తన పార్టీ శ్రేణులతో ప్రసంగిస్తున్నంత సేపూ పోలీసులు ఆయన నివాసం బయటే ఉండిపోయారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ అందుబాటులో లేరని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇదే అంశంపై ఇంటీరియర్‌ మంత్రి రానా సనావుల్లా మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది తప్ప ప్రభుత్వం కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని