Ram Mandir: ప్రపంచంలోనే ఎత్తైన రామ మందిరం.. ఎక్కడో తెలుసా?

రామ భక్తులకు శుభవార్త. ప్రపంచంలోనే ఎత్తయిన రామమందిరాన్ని ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో నిర్మించనున్నారు.

Published : 20 Jan 2024 01:47 IST

పెర్త్‌: అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాకారమై ప్రారంభానికి సిద్ధమైన వేళ రామభక్తులకు మరో శుభవార్త. ప్రపంచంలోనే అతి ఎత్తైన రామాలయం నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో దాదాపు 721 అడుగుల ఎత్తైన రామాలయాన్ని అంతర్జాతీయ శ్రీరామ్‌ వేదిక్‌ అండ్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ నిర్మించనుంది. ఈ ఆలయ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.600 కోట్లు కాగా.. 150 ఎకరాల విస్తీర్ణంలో సకల హంగులతో నిర్మిస్తున్నారు. సంప్రదాయం కలగలిపి వినూత్నంగా ఆలయ ప్రాంగణంలో సుందరమైన భవనాలు, అధునాతన సదుపాయాలతో దీన్ని తీర్చిదిద్దనున్నట్లు ట్రస్ట్‌ డిప్యూటీ హెడ్‌ హరేంద్ర రాణా వెల్లడించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కమ్యూనిటీ కార్యకలాపాలతో కూడిన బహుముఖ కేంద్రంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఆలయ సముదాయంలో విభిన్న భవంతులతో పాటు రామాయణ సదన్‌ లైబ్రరీ, తులసీదాస్‌ హాల్‌, యోగా, ధ్యానం, వేద లెర్నింగ్‌ సెంటర్‌, మ్యూజియం వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. 

రెండో పెద్ద మతంగా హిందూయిజం

మరోవైపు, ఆస్ట్రేలియాలో హిందూమతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ABS) ప్రకారం.. క్రైస్తవ మతం తర్వాత ఆస్ట్రేలియాలో 3శాతం మంది ప్రజలు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆస్ట్రేలియాకు వలసల నేపథ్యంలో అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగానూ హిందూయిజం నిలిచిందని తెలిపింది. తొలిసారి హిందూ వలసదారులు 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియాకు వచ్చినట్లు భావిస్తున్నారు. 1970ల నుంచి న్యూ సౌత్ వేల్స్‌, విక్టోరియా.. ఇతర రాష్ట్రాలు, భూభాగాల కన్నా హిందూమతంతో మతపరమైన అనుబంధాన్ని ఎక్కువగా కలిగి ఉన్నట్లు ఏబీఎస్‌ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని