శ్రీశైలం, పులిచింతలలో విద్యుదుత్పత్తి

ప్రధానాంశాలు

శ్రీశైలం, పులిచింతలలో విద్యుదుత్పత్తి

శ్రీశైలం, నిజాంసాగర్‌ మినహా 50 శాతం నిండిన ప్రాజెక్టులు

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల్లో జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సోమవారం సాయంత్రం సమయానికి విద్యుదుత్పత్తి అనంతరం సాగర్‌ వైపు 21,189 క్యూసెక్కులు వదులుతున్నారు. మధ్యాహ్నం 28,252 క్యూసెక్కులు విడుదల చేసి విద్యుదుత్పత్తి నిర్వహించారు. పులిచింతల వద్ద ఆదివారం సాయంత్రం నుంచి జెన్‌కో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. సోమవారం సాయంత్రం నాటికి ప్రాజెక్టు గేట్లు మూతపడినప్పటికీ 80 మెగావాట్లు ఉత్పత్తి చేస్తూ దిగువకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పరీవాహకంలో కురుస్తున్న వర్షాలకు జూరాలకు భారీగా వరద వస్తోంది. నారాయణపూర్‌ నుంచి దిగువకు 56 వేల క్యూసెక్కులు వస్తున్నప్పటికీ స్థానికంగా వచ్చే ప్రవాహంతో కలిపి జూరాల వద్ద 1.23 లక్షల క్యూసెక్కులు నమోదవుతుండగా 20 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. కృష్ణా పరీవాహకంలో.. శ్రీశైలం, గోదావరి పరీవాహకంలో నిజాంసాగర్‌ మినహా మిగిలిన ప్రాజెక్టులు 50 శాతానికి పైగా నిండాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు కొంత ప్రవాహం వచ్చినప్పటికీ విద్యుదుత్పత్తితో దిగువకు నీటి విడుదల కొనసాగడంతో ప్రస్తుతం 22 శాతం మాత్రమే నిండింది. నిజాంసాగర్‌కు ఎగువ నుంచి సరైన ప్రవాహం రాకపోవడంతో 44 శాతం నిండింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని