
గ్రేటర్ హైదరాబాద్
ఆరు నెలల్లో మూడు దోపిడీలు చేసిన సైబర్ నేరగాళ్లు
ఖాతాదారుల సొమ్ము గల్లంతు
తాజాగా మహేశ్ బ్యాంకులో రూ.12.90 కోట్లు స్వాహా
ఈనాడు - హైదరాబాద్
సైబర్ నేరగాళ్ల తాకిడికి బ్యాంకులు బెంబేలెత్తిపోతున్నాయి. భద్రతా ఏర్పాట్లన్నీ ఛేదించుకొని సర్వర్లలోకి చొరబడుతున్న నేరగాళ్లు బ్యాంకుల్ని లూటీ చేస్తున్నారు. గంటలపాటు ఈ తతంగం జరుగుతున్నా బ్యాంకు సిబ్బంది పసిగట్టలేకపోవడం కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది జులై నెల నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో మూడు బ్యాంకుల్లో ఇదే తరహాలో దోపిడీలు జరిగాయి. తాజాగా జరిగిన మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఏకంగా రూ.12.90 కోట్లు కొల్లగొట్టారు. ఇలాంటి నేరాలను అడ్డుకోలేకపోవడమే కాదు, ఇందులో అసలు నిందితులు ఎవరన్నది తెలుసుకోలేకపోవడం అన్నింటికంటే ఆందోళన రేకెత్తించే అంశం.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఇప్పుడు మామూలయ్యాయి. అయితే సామాన్యులను మాయమాటలతో బురిడీ కొట్టించి ఖాతాలు లూటీ చేయడం చాలాకాలంగా జరుగుతున్న తతంగమే. కానీ ఎన్నో భద్రతా ఏర్పాట్లు ఉండే బ్యాంకుల్లో డబ్బుకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఖాతాదారులను మాయచేసి వారి వ్యక్తిగత వివరాలు, పిన్ నంబరు లేదంటే ఓటీపీ నంబరు తెలుసుకొని దోచుకోవడం వంటివి జరిగినప్పుడు అసలు నేరం జరిగిన విధానంపై అవగాహన ఉంటుంది. కానీ ఏకంగా బ్యాంకుల సర్వర్లలోకి చొరబడి సొమ్ము కొల్లగొడుతున్న ఉదంతాల్లో నేరం ఎలా జరిగిందని తెలుసుకోవడానికే రోజులు పడుతోంది. ఈలోపు దారి మళ్లించిన డబ్బును నిందితులు విత్‌డ్రా చేసుకొని మాయవుతున్నారు. దాంతో నేరగాళ్లు దొరకడం లేదు, డబ్బు రికవరీ కావడంలేదు.
సర్వర్లే లక్ష్యం
గత జులై నెలల హైదరాబాద్‌లోని తెలంగాణ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంకులో రూ.1.96 కోట్లు కొల్లగొట్టారు. డబ్బు పోయిన తర్వాత కానీ నేరాన్ని బ్యాంకు అధికారులు గుర్తించలేకపోయారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినప్పటికీ వారు కేవలం పాత్రధారులేనని, అసలు నిందితులు ఎవరన్నది వారికి కూడా తెలియదని వెల్లడయింది. తర్వాత జరిగిన దర్యాప్తులో ఎక్కడో ఉన్న సైబర్ నేరగాడు రిమోట్ యాక్సెస్ టూల్ (ర్యాట్) విధానంలో ఈ నేరం చేసినట్లు వెల్లడయింది. నేరగాడు తొలుత బ్యాంకు సిబ్బందిలో ఒకరికి ఓ ఈమెయిల్ పంపుతాడు. దీన్ని తెరవగానే సదరు ఉద్యోగి కంప్యూటర్ నేరగాడి అధీనంలోకి వెళ్లిపోతోంది. అంటే ఆ ఈమెయిల్ ద్వారా కంప్యూటర్లోకి ర్యాట్ చొప్పించాడన్నమాట. ఆ ఉద్యోగి కంప్యూటర్ ద్వారా బ్యాంకు సర్వర్లోకి దూరి ఖాతాదారుల వివరాలు తెలుసుకున్నాడు. ఎక్కువ డబ్బు ఉన్న ఖాతాదారులను ఎంపిక చేసుకొని వారికి ఓటీపీ నంబర్లు రాకుండా చేశాడు. అనంతరం వారి ఖాతాల్లోని డబ్బును ఆర్టీజీఎస్ ద్వారా ఇతర ఖాతాల్లోకి మళ్లించాడు. ఇందులో రూ.2 లక్షలు చందానగర్‌లోని ఓ బ్యాంకు ఖాతాలోకి, రూ.1.94 కోట్లను సికింద్రాబాద్‌లోని ఓ యువతి ఖాతాలోకి మళ్లించాడు. దర్యాప్తులో భాగంగా చందానగర్ ఖాతాకు చెందిన యువకుడు, అతని సోదరుడ్ని పోలీసులు ప్రశ్నించారు. టోలీచౌకీకి చెందిన ఓ ఆఫ్రికా దేశస్థుడి అభ్యర్థన మేరకు తమ ఖాతాలోకి డబ్బు వేసుకునేందుకు అంగీకరించామని, పదిశాతం కమీషన్ ఇచ్చాడని వారు తెలిపారు. సికింద్రాబాద్ యువతిని విచారించినప్పుడు తప్పుడు ఆధార్‌కార్డు, చిరునామాతో బ్యాంకు ఖాతా తెరచినట్లు వెల్లడయింది. ఆమె ఖాతాలో పడ్డ రూ.1.94 కోట్లను ఆన్లైన్ ద్వారా మరో పది ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. కానీ ఈ కేసులో అసలు నిందితులింకా పట్టుబడలేదు.
ఆరు నెలల్లో మూడో నేరం
గత జులై నెలలో తొలుత తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకులో ఈ తరహా నేరం జరగ్గా ఆ తర్వాత కొద్ది రోజులకే మరో అంతర్జాతీయ బ్యాంకులోనూ ఇదే తరహాలో రూ.2 కోట్లు కొల్లగొట్టారు. అయితే ఆ బ్యాంకు పరువు పోతుందన్న ఉద్దేశంతో వెంటనే ఖాతాదారులకు డబ్బు సర్దుబాటు చేసింది. ఇప్పుడు మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా ఇదే తరహాలో నేరం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు మళ్లించిన డబ్బును దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో డ్రా చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. దాంతో రికవరీ కూడా కష్టం కానుంది. ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే బ్యాంకుల సైబర్ భద్రతా ప్రమాణాలు పెంచాలని, సిబ్బందికి మరింత అవగాహన కల్పించాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.