ఈ ఏడాది భారత్‌దే అత్యంత వేగవంత వృద్ధి

ప్రభుత్వ వర్గాల అంచనా

దిల్లీ: ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో ఉన్నప్పటికీ.. ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలుస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం కొనసాగుతోందని..  సేవలకు డిమాండు పెరగడం, అధిక పారిశ్రామిక ఉత్పత్తి ఇందుకు ఊతంగా పనిచేస్తున్నాయని అభిప్రాయపడుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐతో కలిసి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందని తెలిపాయి. గత ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్య స్థాయైన 6 శాతానికి ఎగువన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే పరిస్థితి ఉండకపోవచ్చని ఆ వర్గాలు చెప్పాయి. మున్ముందు కరెంటు ఖాతా లోటులో స్థిరత్వం చోటుచేసుకోవచ్చని, దాంతో ద్రవ్యలోటు తగ్గుముఖం పడుతుందని అభిప్రాయపడ్డాయి. రుణాల వ్యయాలపైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోందని తెలిపాయి.  

ఒకట్రెండు రోజుల్లో కేసినోపై నివేదిక: కేసినోలకు జీఎస్‌టీ రేటుపై రాష్ట్రాల మంత్రుల బృందం(జీఓఎమ్‌) ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక మంత్రికి నివేదిక సమర్పించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఈ నెలాఖరులో లేదా సెప్టెంబరు తొలి వారంలో ఈ నివేదికపై జీఎస్‌టీ మండలి సమావేశమై చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, కేసినోలపై తొలుత 28% జీఎస్‌టీ విధించాలని ప్రతిపాదించినా.. కేసినోల విషయంలో మరిన్ని చర్చలు జరగాలని గోవా కోరింది.


మరిన్ని

ap-districts
ts-districts