close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోరుకు సమాయత్తం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార పార్టీ పకడ్బందీ వ్యూహం

ఎప్పటికప్పుడు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

దుబ్బాక ఎన్నికల తర్వాతే కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులపై స్పష్టత

మూడు జిల్లాలను చుట్టేస్తున్న తెజస, తెఇపా, యువ తెలంగాణ నేతలు

ఈనాడు-నల్గొండ: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మరో నాలుగైదు నెలల సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా క్షేత్రస్థాయిలో ప్రచార రంగంలోకి దిగాయి. అధికార తెరాస తమ సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకొనేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. గత నెలలో ప్రారంభమైన నియోజకవర్గాల వారీగా సన్నాహక సభలు, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో మంత్రి జగదీశ్‌రెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి పలు సభలకు హాజరై విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియలో గ్రామానికో ఇన్‌ఛార్జిని నియమించిన అధికార పార్టీ ఇప్పుడు నియోజకవర్గాల వారీగా సభలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తోంది. గతంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్తకు బాధ్యతలు అప్పగించినట్లుగానే ఇప్పుడూ ఎవరికి వారు బాధ్యతలు తీసుకొని వారి సమీపంలోని పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయడంతోపాటు వారిని బూత్‌స్థాయికి తీసుకొచ్చి పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా చూడాలని మంత్రి జగదీశ్‌రెడ్డి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప ఈ దఫా మళ్లీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లానే పోటీలో ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

మూడు జిల్లాలను చుట్టేస్తున్న నేతలు

ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఐకాస మాజీ ఛైర్మన్‌, తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షుడు కోదండరాం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో పర్యటిస్తూ మద్దతు కోరుతున్నారు. కాంగ్రెస్‌ మద్దతివ్వాలని కోరినా వారు స్పందించకపోవడంతో గతంలో తెలంగాణ సాధనలో తనతో కలిసి వచ్చిన పార్టీలు, సంఘాలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. యువ తెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణి రుద్రమ సైతం మూడు ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులను కలిసి మద్దతివ్వాలని కోరుతున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ (తెఇపా) రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ సైతం క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు. కోదండరాం తప్పుకొని తనకు మద్దతివ్వాలని కోరినా ఏకపక్షంగా తెజస అభ్యర్థిని ప్రకటించిందని ఆరోపిస్తూ పలు ప్రజా సంఘాలు తనతో కలిసి వస్తాయని భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న సుదగాని హరిశంకర్‌గౌడ్‌ సైతం గత మూడేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తన ఫౌండేషన్‌ ద్వారా అందించిన సేవలను వివరిస్తూ పట్టభద్రులను కలిసి మద్దతివ్వాలని కోరుతున్నారు.

దుబ్బాక ఎన్నికల తర్వాతే స్పష్టత

ఓ పక్కా అధికార పార్టీ, మరోవైపు తెజస, తెఇపా, యువతెలంగాణ పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై దృష్టి సారించినా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఇంకా క్షేత్రస్థాయిలోకి రాలేదు. ప్రస్తుతం దుబ్బాక ఎన్నికలపైనే పార్టీ దృష్టి కేంద్రీకరించిందని ఎన్నికల తర్వాతనే పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత వస్తుందని మాజీ మంత్రి ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇంటిపోరుతో సతమతమవుతున్న భాజపాలో పోటీకి ఇద్దరు ముగ్గురు నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవలే నల్గొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కోరారు. వరసగా నాలుగు సార్లు వరంగల్‌ జిల్లాకే పోటీ చేసే అవకాశం కల్పించారని, ఈ దఫా నల్గొండ జిల్లా నాయకులకు టిక్కెటివ్వాలని కోరగా దుబ్బాక ఉప ఎన్నిక తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధిష్ఠానం వెల్లడించినట్లు తెలిసింది. వామపక్ష పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన జయసారథిరెడ్డిని ప్రకటించగా మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ వామపక్ష, ప్రజా సంఘాల ప్రభావం తమకు కలిసివస్తుందని సీపీఐ, సీపీఎం పార్టీలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.