
తాజా వార్తలు
కీలుబొమ్మలు తిరగ్గా లేనిది..నాతో ఏంటి సమస్య?
కశ్మీర్ యంత్రాంగంపై ముఫ్తీ విమర్శలు
శ్రీనగర్: తనను మరోసారి చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని, తన కుమార్తె ఇల్తిజాను గృహనిర్బంధంలో ఉంచారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. టెర్రర్ కేసులో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బుధవారం పీడీపీ యువజన విభాగ అధ్యక్షుడు వహీద్ పర్రాను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ క్రమంలో వహీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అక్కడి యంత్రాంగం ముఫ్తీని అనుమతించలేదు.
‘నన్ను మరోసారి చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు. పుల్వామాలోని వహీద్ కుటుంబాన్ని కలిసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా.. జమ్మూకశ్మీర్ యంత్రాంగం నాకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. భాజపా మంత్రులు, వారి కీలుబొమ్మలు కశ్మీర్లో ఇష్టారీతిగా తిరుగుతున్నారు. నా విషయంలో మాత్రమే భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయి’ అంటూ భాజపా, స్థానిక యంత్రాంగంపై విమర్శలు గుప్పించారు. అలాగే తన ఇంటి ముందు ఆగి ఉన్న మిలిటరీ వాహనం చిత్రాలను కూడా షేర్ చేశారు. దక్షిణ కశ్మీర్, మరీ ముఖ్యంగా ఉగ్రదాడులతో తీవ్రంగా ప్రభావితమైన పుల్వామాలో పీడీపీ పూర్వవైభవాన్ని కల్పించే విషయంలో వహీద్ కీలక పాత్ర పోషించారు. అక్కడి నుంచే ఆయన డిస్ట్రిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్ కూడా వేశారు. వాటికి మొదటి దశ ఎన్నికలు నవంబర్ 28న జరగనున్నాయి.
ఈ వ్యవహారంపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ‘మా గేట్ల ముందు ట్రక్కులు నిలపడం అక్కడి యంత్రాంగం విధానంగా మారింది. ఇటీవల నా తండ్రి విషయంలో కూడా ఇదే జరిగింది. న్యాయవ్యవస్థతో సంబంధం లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.