కొవిడ్‌ మరణాలు పోల్చిన మోదీ
close

తాజా వార్తలు

Updated : 26/06/2020 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ మరణాలు పోల్చిన మోదీ

స్పెయిన్‌, ఇటలీ, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ మరణాలకు యూపీతో పోలిక

ఆత్మనిర్భర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ ఆరంభించిన మోదీ, యోగి

దిల్లీ: కరోనా వైరస్‌కు సూదిమందు వచ్చేంత వరకు రెండు గజాల దూరం, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడమే శరణ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి నొక్కిచెప్పారు. ‘ఆత్మనిర్భర్‌ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రారంభించిన ఆయన ఆ రాష్ట్ర ప్రజలతో మాట్లాడారు.

‘సూది మందు వచ్చేంత వరకు రోగనిరోధక శక్తి పెంచుకోవడం, సబ్బునీటితో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్తే మాస్క్‌లు ధరించడం, రెండు గజాల ఎడం పాటిస్తూనే ఉండాలి’ అంటూ నోటికి తువ్వాలను ఎలా అడ్డుపెట్టుకోవాలో మోదీ ప్రదర్శించారు.

వ్యాపార, వాణిజ్య సంఘాల భాగస్వామ్యంతో స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన ‘ఆత్మ నిర్భర్‌ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని ఆరు జిల్లాల ప్రజలతో మాట్లాడారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. యూపీ జనాభా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ జనాభాను పోలుస్తూ ఆ దేశాల్లో 1,30,000 కరోనా మరణాలు సంభవించాయని తెలిపారు.

‘ఆ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాయి. పైగా అత్యంత శక్తిమంతమైనవి. ఈ నాలుగు దేశాల జనాభా మొత్తం 24 కోట్లు. కానీ భారత్‌లో ఒక్క యూపీ జనాభానే 24 కోట్లు. కరోనా వైరస్‌ను ఆ నాలుగు దేశాల కన్నా యూపీయే సమర్థంగా కట్టడి చేసింది. వైరస్‌ వల్ల అక్కడ 1,30,000 మంది మరణించగా ఇక్కడ 600 మరణాలు నమోదయ్యాయి. ఏదేమైనప్పటికీ మరణం మరణమే. ప్రతి ఒక్కరి జీవితమూ విలువైందే. అది భారత్‌లోనైనా ప్రపంచంలో మరెక్కడైనా’ అని మోదీ అన్నారు. కష్టకాలంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని