విజయన్‌ అడుగుజాడల్లో కమల్‌!
close

తాజా వార్తలు

Published : 22/02/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయన్‌ అడుగుజాడల్లో కమల్‌!

కేరళ ప్రభుత్వ వ్యూహాలను అనుసరిస్తున్న కమల్‌ హాసన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ కేరళ సీఎం పినరయి విజయన్‌ దారిలో నడుస్తున్నారు. గెలుపు కోసం లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే వామపక్షాల ఇలాఖాలో ఫలించిన వ్యూహాలు ద్రవిడనాట ప్రభావం చూపుతాయా?, తమిళనాట ద్విముఖ పోరుకు చరమ గీతం పాడి మూడో పార్టీకి ఆధిక్యం కట్టబెడతాయా అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. 

తమిళనాడులో దశాబ్దాలుగా ద్విముఖ పోరు సాగుతోంది. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రంగప్రవేశంతో ఈ ఆనవాయితీకి తెరపడుతుందని భావించినప్పటికీ తలైవా వెనక్కి తగ్గడంతో అందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌తో ప్రతిపక్ష డీఎంకే, మరో వ్యూహకర్త సునీల్‌ కనుగోలుతో అధికార అన్నాడీఎంకే జట్టుకట్టాయి. 2018లో రాజకీయ పార్టీ ప్రారంభించి గత సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లు దక్కించుకున్న కమల్‌ పార్టీ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం కేరళలో ఎల్‌డీఎఫ్‌ అమలు చేసిన వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ సీఎం పినరయి విజయన్‌ను కమల్‌ తన రాజకీయ గురువుగా భావిస్తారు. ఈ విషయాన్ని గతంలో ఆయన బహిరంగంగానే వెల్లడించారు. కమల్‌ ఇప్పుడు తన గురువు దారిలోనే నడిచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు.

డిసెంబర్‌లో జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ అఖండ విజయం సాధించింది. ప్రజల్లో పేరున్న వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పబ్లిక్‌ సర్వెంట్ల ద్వారా ఓటర్లను ఆకర్షించింది. ఇప్పుడు కమల్‌ సైతం అదే విధంగా పావులు కదుపుతున్నారు. పేరున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. విశ్రాంత ఐపీఎస్‌ ఏజీ మౌర్య ఇటీవలే పార్టీలో చేరారు. ఐఏఎస్‌ అధికారి డా.సంతోష్‌కుమార్‌ సైతం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి మక్కల్‌ నీది మయ్యమ్‌లో చేరారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పొన్‌రాజ్‌తోపాటు వీఆర్‌ఎస్‌ తీసుకున్న మరో ఐఏఎస్‌ అధికారి సఘాయమ్‌ కమల్‌ పార్టీలో చేరారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అరాప్పోర్‌ ఇయాక్కమ్‌, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే పూవులాగిన్‌ నన్‌బార్గల్‌ సంస్థతో కమల్‌ మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా మంచి పేరున్న వ్యక్తులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సఘాయమ్‌, పొన్‌రాజ్‌లను శాసనసభ ఎన్నికల బరిలోకి దించాలని కమల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ సీఎం విజయన్‌ మార్క్‌ రాజకీయాలు తమిళనాట ఏ మేరకు ఫలిస్తాయన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని