close
కారు చౌకబేరం 

రాయితీపై విద్యుత్‌ వాహనాలు 
ఈఈఎస్‌ఎల్‌ ద్వారా 8 రాష్ట్రాల్లో ‘ఈ-మొబిలిటీ’ పథకం 
10 వేల విద్యుత్‌ వాహనాలు రాయితీపై అద్దెకు 
ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు 
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు నెలకు రూ.22,500 అద్దెకు ఈ-కారు

ఈనాడు, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా విద్యుత్‌ వాహనాలు దూసుకొస్తున్నాయి. వీటి తయారీని ఇప్పటికే దేశంలో అనేక కంపెనీలు చేపడుతున్నాయి. వీటిని రోడ్లపై ప్రభుత్వ సంస్థల ద్వారా వినియోగిస్తే సాధారణ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని కేంద్రం కొత్త కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. వీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాయితీలతో వాహనాలు సమకూర్చే ‘ఈ-మొబిలిటీ’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకాన్ని గతేడాది ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించగా ఇప్పుడు ఈ పథకం అమలుకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌’(ఈఈఎస్‌ఎల్‌) పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 10 వేల విద్యుత్‌ వాహనాలను రాయితీపై సమకూర్చనుంది. ప్రభుత్వ శాఖలతోపాటు ప్రైవేటు సంస్థలకు ఈ వాహనాలను అద్దెకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కార్ల ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. విద్యుత్‌ కారును అద్దెకు తీసుకుంటే నెలకు రూ.22,500 చొప్పున చెల్లించాలి. ఆరేళ్ల అనంతరం వాహనాన్ని అదే సంస్థకు ఇచ్చేస్తారు. అంటే కారు వినియోగించుకునే సంస్థ లేదా ప్రభుత్వ శాఖ ముందుగా పైసా చెల్లించకుండా నెలకు రూ.22,500 చొప్పున కిస్తీ కడుతూ వెళితే ఆరేళ్లకు సదరు కారు సొంతమవుతుంది. అవసరమైతే డ్రైవర్‌తో సహా వాహనాన్ని సమకూర్చడానికి సిద్ధమని ఈఈఎస్‌ఎల్‌ స్పష్టం చేసింది. ఇలా అయితే నెలకు రూ.40 వేలు చెల్లించాలి. ఇప్పటికే హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)కు 22 విద్యుత్‌ కార్లు సమకూర్చింది. ఈ సంస్థ ఈ వాహనాలను ఇంకా రహదారులపై వినియోగంలోకి తీసుకురాకుండా పక్కన పెట్టింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ‘ఈ-మొబిలిటీ’ పథకం అమలుకు చకచకా ఏర్పాటు చేస్తున్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు వందలాది సాధారణ కార్లను అద్దెకు తీసుకుని అధికారిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాయి. కొన్ని శాఖల్లో వీటికి నెలకు రూ.30 వేలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. వీటి స్థానంలో విద్యుత్‌ కార్లను ఈ సంస్థ నుంచి తీసుకుంటే ఆరేళ్లకు సదరు శాఖకు కారు సొంతమవ్వడంతోపాటు, అద్దె రూపంలో సొమ్ము ఆదా అవుతుంది. అన్నింటికి మించి కాలుష్యాన్ని తగ్గించినట్లు అవుతుంది’’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దిల్లీ నగర పాలక సంస్థ పరిధిలో ఈ సంస్థ ఇప్పటికే 30 విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

దేశానికి ఎంతో ప్రయోజనం 

దేశాన్ని కాలుష్యం, చమురు ఆర్థిక భారాల నుంచి రక్షించడానికి ప్రతీ ఒక్కరు విద్యుత్‌ కార్ల వినియోగానికి ముందుకు రావాలి. డీజిల్‌, పెట్రోలు ధరలు పెరుగుతున్నందున ఆర్థిక భారం పడుతోంది. పైగా వాటిని విదేశాల నుంచి కొనాలి. విద్యుత్‌ వాహనాల వల్ల ఈ సమస్య తప్పుతుంది. వీటిని వినియోగిస్తే దేశానికి ఎంతో ప్రయోజనం అని అందరూ గుర్తించాలి.

- సావిత్రిసింగ్‌, అదనపు జనరల్‌ మేనేజర్‌, ఈఈఎస్‌ఎల్‌

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.