close
హైదరాబాద్‌ నుంచి మరిన్ని సేవలు

2021 జులైలో నూతన భవనం నుంచి కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల్లో అమెరికన్‌ కార్నర్లు
ఏటా అయిదు శాతం పెరుగుతున్న వీసా దరఖాస్తులు
తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దు
టైగర్‌ ట్రంప్‌ పేరుతో కాకినాడ, విశాఖలలో రెండు దేశాల మిలిటరీ విన్యాసాలు
వచ్చే నెలలో రెండు రోజుల పాటు ఇండో-యూఎస్‌ రక్షణ సదస్సు
‘ఈనాడు’తో హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్మాన్‌

‘తెలుగు రాష్ట్రాల్లో అమెరికా కాన్సుల్‌ సేవలను రానున్న కాలంలో విస్తృతం చేయనున్నాం. హైదరాబాద్‌ కాన్సులేట్‌ ద్వారా అందజేస్తున్న సేవలను మూడింతలు పెంచనున్నాం. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో అమెరికా కార్నర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. ఈ నెల మూడో వారంలో భారతదేశంలో తొలిసారిగా టైగర్‌ ట్రంప్‌ పేరిట ఇండియా-అమెరికా మిలటరీ విన్యాసాలు నిర్వహించనున్నాం. ఇండియా-అమెరికా మధ్య రక్షణ సంబంధాలను విస్తరించేందుకు డిసెంబరు మూడో వారంలో ఇండో-యూఎస్‌ రక్షణ సదస్సు (డిఫెన్స్‌ కాన్ఫరెన్స్‌) నిర్వహించనున్నాం. ఈ తరహా సదస్సు నిర్వహించటం ఇదే మొదటిసారి’ అని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్మాన్‌ వెల్లడించారు. ఆయన ‘ఈనాడు’తో  మాట్లాడారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమెరికా కాన్సుల్‌ సేవలను విస్తరించే ఆలోచన ఉందా
రానున్న కాలంలో సేవలను విస్తరిస్తాం. హైదరాబాద్‌లో 12.5 ఎకరాల్లో నిర్మిస్తున్న భవనం 2021 జులైలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం నగరంలో 16 గవాక్షాలు(విండోస్‌)ద్వారా వీసా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. నూతన భవనంలో 56 గవాక్షాలను ఏర్పాటు చేస్తాం. ఈ విధానం ద్వారా ఇంటర్వ్యూ సమయం కోసం వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కార్యరూపంలోకి వస్తుందా
ఆంధ్రప్రదేశ్‌ మాకు కీలకం. అయితే.. ప్రతి రాష్ట్రంలో కాన్సులేట్‌ ఏర్పాటు చేయలేం. కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలంటే 200 మిలియన్‌ డాలర్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో అమెరికన్‌ కార్నర్‌ పేరిట కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఇందుకోసం స్థానిక విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటాం. ఈ కేంద్రాలు వీసాలు జారీ చేయవు. వీసా పొందాలనుకునే విద్యార్థులను చైతన్యపరుస్తాయి. ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తామన్నది చెప్పలేను కానీ నా లక్ష్యాల్లో ఉంది.

అమెరికా వీసాలు పొందటం కష్టతరంగా మారుతోంది. విద్యార్థుల కలలు సాకారం చేయాలంటే మీరిచ్చే సూచనలు..
వీసా పొందటం కష్టమేమీ కాదు. గడిచిన అయిదేళ్ల గణాంకాలు చూస్తే ఏటా అయిదు శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి-అక్టోబరు మధ్య 19 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. గడిచిన ఏడాది 13,600 దరఖాస్తులు వచ్చాయి. అవసరమైన సలహాల కోసం యూఎస్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌, హైదరాబాద్‌లోని అమెరికన్‌ కార్నర్‌లను సంప్రదించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలోను కాన్సులర్లు ఉన్నారు. అత్యవసరమైతే ‌
www.ustraveldocs.com/in కు దరఖాస్తు చేసుకుంటే త్వరగా ఇంటర్వ్యూ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.

అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్థులు తరచూ ఇబ్బంది పడుతున్నారు. మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది
ప్రపంచం మొత్తం మీద అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నంత రక్షణ ఎక్కడా ఉండదు. అనుమతిలేని విశ్వవిద్యాలయాల్లో చేరి విద్యార్థులు ఇబ్బందులు పడొద్దు. తప్పుడు మార్గాలు ఎప్పుడూ సమస్యాత్మకమే.

తెలుగు రాష్ట్రాల్లో అమెరికా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఎలాంటి అవకాశాలున్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో 150 అమెరికా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 120 కంపెనీలు తెలంగాణలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కూ చాలా కంపెనీలు వచ్చాయి. ఇండియా-అమెరికా మధ్య 140 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం సాగుతోంది. పదేళ్ల కిందటి కన్నా ఇది అయిదు రెట్లు పెరిగింది. ఐటీ, ఫార్మా, రక్షణ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. త్వరలో మరిన్ని కంపెనీలు రానున్నాయి. అమెరికాలోని ఆహార ఉత్పత్తుల కంపెనీలు తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి.

హైదరాబాద్‌ వేదికగా జరిగే ఇండో-అమెరికా రక్షణ సదస్సు ప్రధాన ఉద్దేశం ఏమిటి
వచ్చే నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో సదస్సు జరగనుంది. రెండు దేశాలు సంయుక్తంగా పరిశోధనలు, తయారీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ సమావేశం ఉపకరిస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఇండియా-అమెరికా రక్షణ వాణిజ్యం ప్రస్తుతం 18 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. టైగర్‌ ట్రంప్‌ పేరుతో దేశంలో తొలిసారిగా ఇండియా-అమెరికా త్రివిధ దళాల విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు కాకినాడలో, 16 నుంచి 20వరకు విశాఖపట్నంలో ఈ విన్యాసాలుంటాయి.సుమారు నాలుగు వేల మంది పాల్గొంటారు.

- ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.